ప్రజావాణి దరఖాస్తులపై అలసత్వం వద్దు
118 దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరించాలి
కలెక్టర్ దీపక్ తివారి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 28): ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన దరఖాస్తులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిర్ణీత గడువులోగా సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి 118 దరఖాస్తులు అందాయి.ఈ సందర్భంగా కలెక్టర్ దీపక్ తివారి మాట్లాడుతూ.. ప్రజల సమస్యలకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతి దరఖాస్తును బాధ్యతగా పరిశీలించాలని సూచించారు. దరఖాస్తుదారులకు సాధ్యమైనంత త్వరగా పరిష్కారం చూపేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి లేకుండా నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ, వాటి స్థితిగతులను పరిశీలించాలని సూచించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదును నిర్లక్ష్యం చేయకుండా పరిష్కారానికి చర్యలు చేపట్టాలని తెలిపారు.
*హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలి
అధికారులు, సిబ్బంది ‘మీ ప్రమాణం’ మొబైల్ యాప్ ద్వారా తమ హాజరును తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో సేవల నిర్వహణలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని తెలిపారు. అధికారులు, సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, డీఆర్‌డీఓ శ్రీనివాస్, డీఆర్వో స్వర్ణలత, జెడ్పీ సీఈవో సుధీర్‌తో పాటు వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.