తొలి చిత్రమే కావడంతో చాలా లక్కీగా ఫీలవుతున్నా: తత్వం హీరోయిన్ దష్విక ప్రత్యేక ఇంటర్వ్యూ
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: వైవిధ్యమైన కథాంశాలతో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు మరో సరికొత్త మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. దినేష్ తేజ్ హీరోగా, నూతన నటి దష్విక.కె హీరోయిన్‌గా నటించిన తత్వం సినిమా అక్టోబర్ 2వ తేదీన థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రానికి అర్జున్ కోల దర్శకత్వం వహించగా, త్రయతి ఇషాని క్రియేషన్స్ మరియు ఎస్.కె. ప్రొడక్షన్స్ పతాకాలపై శీమకుర్తి వంశీ కృష్ణ, శ్వేత పసుపులేటి సంయుక్తంగా నిర్మించారు. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో కథానాయిక దష్విక మీడియా ప్రతినిధులతో ముచ్చటించి సినిమా విశేషాలను, తన పాత్ర అనుభవాలను పంచుకున్నారు.
తనకు నటనపై చిన్నప్పటి నుంచే మక్కువ ఉండేదని, మూడో తరగతి చదువుతున్నప్పుడే ఉపాధ్యాయులకు తాను నటిని అవుతానని చెప్పినట్లు దష్విక గుర్తు చేసుకున్నారు. విశాఖపట్నానికి చెందిన తాను హీరో విజయ్ దేవరకొండతో కలిసి ఒక వాణిజ్య ప్రకటనలో నటించానని, ఆ తర్వాత సినిమాల్లోకి రావాలనే ప్రయత్నంలో భాగంగా ఈ చిత్రానికి ఆడిషన్స్ ద్వారా ఎంపికైనట్లు తెలిపారు. తొలి సినిమాతోనే నటనకు మంచి ఆస్కారం ఉన్న పాత్ర లభించడం తన అదృష్టమని, ఈ కథ విన్న వెంటనే తనకు ఎంతగానో నచ్చిందని ఆమె పేర్కొన్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ కథలో తన పాత్రకు గ్రే షేడ్స్ ఉంటాయని, అయితే సినిమా చూసిన అందరికీ ఆ పాత్ర నచ్చుతుందని వెల్లడించారు.
మలయాళంలో వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ల మాదిరిగానే ఈ చిత్రం కూడా ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠకు గురిచేస్తుందని దష్విక తెలిపారు. చిత్రంలో హీరో దినేష్ తేజ్ తనకు ఎంతో సపోర్ట్ చేశారని, దర్శకుడు అర్జున్ కోల సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తూ కూడా ఈ సినిమా కోసం మూడు నెలలు సెలవు తీసుకుని ఎంతో స్పష్టతతో చిత్రాన్ని తెరకెక్కించారని ప్రశంసించారు. చేతన భరద్వాజ్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని చెప్పారు. టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమా కథ కూడా చాలా విభిన్నంగా ఉంటుందని, అక్టోబర్ 2న థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు ఖచ్చితంగా ఒక కొత్త అనుభూతిని పొందుతారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.