ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ చూపాలి
దిశ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్.. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ, వైద్య సేవల మెరుగుదలపై కీలక సూచనలు
మేడ్చల్–మల్కాజిగిరి, మేజర్ న్యూస్: జిల్లాలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, వివిధ శాఖల పనితీరు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. శుక్రవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన జిల్లా అభివృద్ధి, పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ప్రగతిని సమీక్షించి, ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు పలు కీలక సూచనలు చేశారు.
ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు చర్యలు
ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఈటల రాజేందర్ సూచించారు. గుర్తించిన ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్, కాంపౌండ్ వాల్స్ నిర్మించి పిల్లల పార్కులు, కమ్యూనిటీ హాళ్లుగా అభివృద్ధి చేయాలని తెలిపారు. ప్రభుత్వ స్థలాలను పేదలు ఉపాధి పొందేందుకు కూరగాయల మార్కెట్లు, చిన్న దుకాణాల ఏర్పాటుకు వినియోగించాలే తప్ప, వేలం వేసే ప్రయత్నాలు చేయవద్దని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే పేదలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఆసుపత్రుల్లో లేబర్ రూమ్‌లను మెరుగుపరచడంతో పాటు కోల్డ్ చైన్ వ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూడాలన్నారు. విద్యుత్ అంతరాయం ఏర్పడినప్పుడు ఇబ్బందులు తలెత్తకుండా పవర్ బ్యాకప్ ఏర్పాటు చేయాలని, మందుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అర్బన్ హెల్త్ సెంటర్లు, పీహెచ్‌సీలలో వైద్యుల కొరత ఉంటే తాత్కాలిక నియామకాలకు ప్రతిపాదనలు పంపాలని సూచించారు. తెలంగాణ డయాగ్నొస్టిక్స్ సేవలు నిరంతరం అందుబాటులో ఉండేలా చూడాలని, కిడ్నీ, బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు అవసరమైన పరీక్షలు నిర్వహిస్తూ అంబులెన్స్‌ల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
అంగన్‌వాడీలపై ప్రత్యేక దృష్టి
అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహార నాణ్యత, అందుతున్న సేవలపై వస్తున్న ఫిర్యాదులను అధికారులు పరిశీలించి పరిష్కరించాలని సూచించారు. తక్కువ సంఖ్యలో పిల్లలు ఉన్న లేదా సరైన వసతులు లేని కేంద్రాలను అవసరాన్ని బట్టి సమీపంలోని కమ్యూనిటీ హాళ్లకు మార్చే అంశాన్ని పరిశీలించాలని కలెక్టర్‌కు తెలిపారు. మహిళలు, పిల్లలకు సంబంధించిన చిన్నపాటి సమస్యలను సాధ్యమైనంతవరకు సామరస్యపూర్వకంగా పరిష్కరించేలా సంబంధిత శాఖలు చొరవ చూపాలన్నారు.
మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం
జనాభా పెరుగుదలకు అనుగుణంగా స్టార్మ్ వాటర్ డ్రైనేజీలు, మురుగునీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు), తాగునీటి పైప్‌లైన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయాల్లో తాగునీరు, సీసీ కెమెరాలు తదితర కనీస వసతులు కల్పించాలని, సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వారపు సంతలు, రోడ్ల పక్కన వ్యాపారాలు నిర్వహించే చిరు వ్యాపారుల సమస్యలను ట్రాఫిక్ పోలీసులతో సమన్వయం చేసుకుని పరిష్కరించాలని తెలిపారు.
పెండింగ్ పనులు గడువులోగా పూర్తి చేయాలి
రైల్వే శాఖ పరిధిలోని రోడ్ ఓవర్ బ్రిడ్జిలు (ఆర్‌ఓబీలు), రోడ్ అండర్ బ్రిడ్జిలు (ఆర్‌యూబీలు) పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని రైల్వే అధికారులకు సూచించారు. అగ్నిమాపక కేంద్రాల పనితీరును మెరుగుపరిచి అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ, బియ్యం సరఫరాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని పౌర సరఫరాల శాఖ అధికారులకు సూచించారు.
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
గతంలో గ్రామ పంచాయతీలుగా ఉన్న అనేక ప్రాంతాలు మున్సిపాలిటీల్లో, నగర పరిధిలో విలీనమైన నేపథ్యంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి పరిష్కరించాలని ఈటల రాజేందర్ తెలిపారు. అవసరమైన నిధుల కేటాయింపు కోసం ముఖ్యమంత్రితో చర్చించి తగిన చర్యలు తీసుకునేలా కలెక్టర్ కృషి చేయాలని సూచించారు. జాతీయ రహదారులు, పోస్టల్, మైనింగ్, ఉపాధి, విద్య తదితర శాఖల్లో సమస్యలను పరిష్కరించి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. అవసరమైతే జిల్లా కలెక్టర్‌తో సమావేశమై సమస్యలపై చర్చించాలని అధికారులకు సూచించారు. సీఎస్‌ఆర్ నిధులను సద్వినియోగం చేసుకుని మహిళలు, గర్భిణులు, పిల్లలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులు, దిశ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.