కూటమి ప్రభుత్వంతోనే విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు: సబ్బవరం కాలేజీ అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే పంచకర్ల, ఎమ్మెల్సీ చిరంజీవి
పెందుర్తి, సూర్య : సబ్బవరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల రూపురేఖలను అతి త్వరలోనే సరికొత్తగా మారుస్తామని పెందుర్తి శాసనసభ్యులు, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. శుక్రవారం కళాశాల ఆవరణలో రూ.3.36 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనులకు ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, బిజెపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ చొక్కాకుల వెంకట్రావుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం కళాశాల ఆవరణమంతా కలియతిరిగి, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక వసతుల కల్పనపై అధికారులు, కళాశాల సిబ్బంది, కూటమి నాయకులతో క్షుణ్ణంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ.. కళాశాల ప్రిన్సిపాల్ నివేదిత మంచి లక్ష్యంతో కళాశాలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ఆమెకు పూర్తి సహాయ సహకారాలు అందించడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. "ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు నిధులు మంజూరు చేయించాం. కొన్ని సాంకేతిక కారణాల వల్ల పనులు కొంత ఆలస్యమైనప్పటికీ, ఇకపై శరవేగంతో పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పిస్తాం" అని వెల్లడించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి అనుభవం, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ దృఢ సంకల్పం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చొరవతో ఈ కళాశాలను నియోజకవర్గానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేశారు. అలాగే, కళాశాల భూముల్లో ఆక్రమణలు ఉంటే వెంటనే తొలగించాలని ఎమ్మార్వో మరియు పోలీసు అధికారులను ఈ సందర్భంగా ఆదేశించారు.
ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి మాట్లాడుతూ, ఎమ్మెల్యే రమేష్ బాబు నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్యంగా విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ పద్మజ, ఎంఈఓ రవీంద్రబాబు, కళాశాల చైర్మన్ మామిడి శంకర్రావు, వైస్ ప్రిన్సిపాల్ గోపాలకృష్ణ, రాష్ట్ర కనీస వేతనాల డైరెక్టర్ బల్రెడ్డి అప్పారావు, ఎన్డీయే మహాకూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధ్యాపకులు మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.