telanagana
అశ్వారావుపేట బీఆర్ఎస్‌లో ఆధిపత్య పోరు
సూర్య ,అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం "ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. తీపి ముచ్చటాడుకున్నట్టు" తయారైంది. రాష్ట్రంలో అధికారంలో లేక, పార్టీ తీవ్రమైన కష్టకాలంలో ఉన్న వేళ నాయకులంతా కలిసికట్టుగా పనిచేసి కార్యకర్తల్లో ధైర్యం నింపాల్సింది పోయి, స్థానిక నాయకత్వం రెండు వర్గాలుగా విడిపోయి అంతర్గత పోరుతో వీధిపాలవుతోంది. పార్టీని తిరిగి పుంజుకునేలా చేయడం పక్కనపెట్టి, సొంత పార్టీ నేతలపైనే పైచేయి సాధించేందుకు వ్యూహాలు పన్నుతుండటం గమనార్హం.
ఎవరు దొరుకుతారు? ఎవరిని బ్లేమ్ చేద్దాం?
ప్రస్తుతం నియోజకవర్గంలో ఉన్న రెండు గ్రూపుల నేతల ఆలోచన ఒక్కటే — "ఎదుటి వర్గంలో ఎవరు దొరుకుతారు? వాళ్లపై ఎలా బురద జల్లాలి? పార్టీ ఓటమికి లేదా వైఫల్యాలకు ఎదుటివాళ్లను ఎలా బాధ్యులను చేయాలి?" అని చూసుకోవడమే సరిపోతోంది. రాబోయే స్థానిక సంస్థల, ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహాలు, గ్రామాల వారీగా పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీసే కార్యాచరణలను పూర్తిగా పక్కనపెట్టేశారు. నిత్యం సోషల్ మీడియాలోనూ, రచ్చబండల దగ్గరా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు సొంత అజెండాలతో రాజకీయం చేస్తూ పార్టీ శ్రేణులను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నారు.
అధిష్టానం మాట ఒకటైతే.. ఇక్కడ నడిచేది మరొకటి!
అధినేత కేసీఆర్, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు రోజూ వేదికలపై నుంచి స్పష్టంగా చెప్తున్నారు: "అంతర్గత విభేదాలు పక్కన పెట్టండి, ఐకమత్యంగా ఉండండి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో పోరాడండి, కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు అండగా నిలవండి" అని. కానీ అశ్వారావుపేటలోని స్థానిక నాయకులకు అధిష్టానం మాటలు అసలు చెవిన పడటం లేదు. అధిష్టానం పిలుపునిచ్చే నిరసన కార్యక్రమాలు, ధర్నాల్లో కూడా రెండు వర్గాలు కలిసి రాకపోవడం శోచనీయం. ఒక వర్గం ఒక చోట కార్యక్రమం చేస్తే, ఇంకో వర్గం మరో చోట పోటీగా కార్యక్రమాలు చేస్తూ అధిష్టానం ముందు మార్కులు కొట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. దీనివల్ల పార్టీ పరువు బజార్న పడటమే కాకుండా, ప్రజల్లో నవ్వులపాలవుతున్నారు.
ఎన్నికల వేళ కీలక సమయం.. కార్యకర్తల తీవ్ర ఆవేదన:
అన్ని రాజకీయ పార్టీలకు ఇది ఎంతో కీలకమైన సమయం! రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్సీ పోరుకు శ్రేణులను సిద్ధం చేయాల్సిన బాధ్యత నాయకులపై ఉంది. ఇలాంటి కీలక సమయంలో గ్రూపు రాజకీయాలు, వ్యక్తిగత ఆధిపత్య పోరు పక్కనబెట్టి, క్యాడర్‌లో ధైర్యం నింపాల్సింది పోయి.. అశ్వారావుపేట బీఆర్ఎస్‌లో మాత్రం నాయకులు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారు.
రాష్ట్రంలో అధికారం పోయినా, నియోజకవర్గంలో పార్టీ జెండాను బ్రతికించుకోవడానికి కిందిస్థాయి కార్యకర్తలు సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ కష్టపడుతుంటే, స్థానిక కీలక నేతలు మాత్రం తమ స్వార్థం, ఆధిపత్యం కోసం గ్రూపు తగవులతో కాలం గడిపేస్తున్నారు. 'పార్టీని బ్రతికించుకోవడం కంటే.. సొంత పార్టీ నేతలను దెబ్బతీయడమే ప్రధాన అజెండాగా మారిపోవడం' పట్ల క్షేత్రస్థాయి కార్యకర్తలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించి, రెండు గ్రూపుల నాయకులను పిలిచి క్లాస్ పీకి, ఈ తలనొప్పికి శాశ్వత చెక్ పెట్టకపోతే.. అశ్వారావుపేటలో బీఆర్ఎస్ క్యాడర్ పూర్తిగా చెల్లాచెదురై, పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
సూర్య ,అశ్వారావుపేట, ఆర్.సి.(మేజర్ న్యూస్)