మర్పడగ రైస్ మిల్లు వెనుక మృతదేహం లభ్యం
సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడగ శివారులోని రైస్ మిల్లు వెనుక రోడ్డు పక్కన పొలం గట్టుపై ఓ వ్యక్తి శవం లభ్యమైన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల కథనం ప్రకారం... రోడ్డుపై వెళ్తున్న కొందరు వ్యక్తులకు పొలం గట్టు నుండి ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపించింది. అనుమానంతో అటువైపు వెళ్లి చూడగా ఓ బైక్ పక్కన ఒక వ్యక్తి మృతి చెంది పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సిద్దిపేట పట్టణ ఏసీపీ, త్రీ టౌన్ సీఐ లక్ష్మీ బాబు సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో మృతుడిని సిరిసినగండ్ల గ్రామానికి చెందిన చెంది నాగరాజుగా గుర్తించారు. నిన్న సాయంత్రం నుండి నాగరాజు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న సమయంలోనే ఈ విషాద వార్త తెలియడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.