పెంబర్తి గ్రామంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం
జనగామ ప్రతినిధి, మేజర్ న్యూస్,లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పెంబర్తి గ్రామంలో ఉచిత కంటి వైద్య పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. గ్రామానికి చెందిన పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ రేఖ రాజు ముఖ్య అతిథిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. కంటి చూపు సమస్యలతో బాధపడుతున్న గ్రామీణులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. కంటి వైద్య శిబిరంలో నిపుణులైన వైద్య బృందం పాల్గొని గ్రామస్తులకు అత్యాధునిక పరికరాలతో ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించారు. దృష్టి లోపాలు ఉన్నవారికి అవసరమైన సలహాలు, సూచనలతో పాటు ఉచితంగా మందులను అందించారు. కంటి శుక్లాల (కేటరాక్ట్) సమస్య ఉన్న బాధితులను గుర్తించి, వారికి ఉచితంగా శస్త్రచికిత్సలు చేయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని నిర్వాహకులు తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజల దరిదాపుల్లోకే ఉచిత వైద్య సేవలను తీసుకువచ్చిన లయన్స్ క్లబ్ ప్రతినిధులకు మరియు సర్పంచ్ రేఖ రాజు కి గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు, స్థానిక నాయకులు, వైద్య సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.