పెళ్లి పేరుతో దగా.. పదేళ్లుగా యువతిని మోసం చేసిన యువకుడు.. పోక్సో చట్టం కింద కేసు నమోదు
దోమ, మేజర్ న్యూస్ (అక్టోబర్ 03): వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని తిమ్మాయిపల్లి తండాలో తీవ్ర కలకలం రేపిన దారుణ ఘటన వెలుగు చూసింది. ప్రేమ పేరుతో వంచించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత పదేళ్లుగా ఓ యువతిని శారీరకంగా వాడుకుని చివరికి మోసం చేసిన కామాంధుడి లీలలు ఆలస్యంగా బయటపడ్డాయి. తిమ్మాయిపల్లి తండాకు చెందిన యువతిని, బొంపల్లి తండాకు చెందిన యువకుడు ప్రేమ పేరుతో మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నమ్మిన వ్యక్తి పెళ్లికి నిరాకరించి ముఖం చాటేయడంతో బాధితురాలు తీవ్ర మనోవేదనకు గురై పోలీసులను ఆశ్రయించింది. ఈ అమానుష ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బొంపల్లి తండాకు చెందిన ఓ యువకుడు అదే మండలంలోని తిమ్మాయిపల్లి తండాకు చెందిన యువతితో గత పదేళ్ల క్రితం పరిచయం పెంచుకున్నాడు. తాను ప్రేమిస్తున్నానని, కచ్చితంగా పెళ్లి చేసుకుని జీవితాంతం చూసుకుంటానని నమ్మబలికాడు. యువతి అతడిని పూర్తిగా నమ్మడంతో, గత పదేళ్ల కాలంలో అనేక మార్లు ఆమెను శారీరకంగా వాడుకున్నాడు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ పెళ్లి గురించి యువతి ప్రస్తావన తెచ్చినప్పుడల్లా నిందితుడు ఏదో ఒక సాకుతో కాలయాప్తు చేస్తూ వచ్చాడు. ఇటీవల పెళ్లి చేసుకోమని ఆమె తీవ్రంగా నిలదీయగా, నిందితుడు పెళ్లికి నిరాకరించడమే కాకుండా ఆమెను బెదిరింపులకు గురిచేశాడు.తనను నమ్మించి నిలువునా మోసం చేసిన యువకుడి మోసాన్ని గ్రహించిన బాధితురాలు దిక్కుతోచని స్థితిలో దోమ పోలీసులను ఆశ్రయించి జరిగిన దారుణంపై సమగ్రంగా ఫిర్యాదు చేసింది. బాధితురాలి నుంచి వివరాలు సేకరించిన పోలీసులు ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వెంటనే స్పందించారు. బాలిక లేదా యువతిపై జరిగిన లైంగిక దౌర్జన్యాలు, మోసాలకు సంబంధించి పదేళ్ల కిందటి నుంచి ఘటనలు కొనసాగడంతో చట్టపరమైన ఆధారాల మేరకు నిందితుడిపై పోక్సో చట్టంతో పాటు సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. త్వరలోనే అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు స్పష్టం చేశారు.
రిపోర్టర్ బద్రి.
Also Read: అంత్యక్రియలకు వెళ్తూ అనంతగిరి ఘాట్‌లో ఘోర ప్రమాదం