పసుపు పంటలో తెగుళ్లు, పురుగుల నివారణకు చర్యలు
రైతులు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి
క్లస్టర్ స్థాయి ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి కె.అక్షితా రెడ్డి
మోమిన్‌పేట్,మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 25):పసుపు పంటలో వివిధ రకాల పురుగులు, తెగుళ్లు ఆశించే అవకాశం ఉన్నందున రైతులు ముందస్తుగా సస్యరక్షణ చర్యలు చేపట్టాలని మోమిన్‌పేట్, మర్పల్లి, నవాబ్‌పేట్ క్లస్టర్ స్థాయి ఉద్యాన, పట్టు పరిశ్రమల అధికారి కె. అక్షితా రెడ్డి సూచించారు.
*ఆకుమీద రంధ్రాలు చేసే పురుగుల నివారణకు
పసుపు పంటలో ఆకుమీద రంధ్రాలు చేసే పురుగుల నివారణకు ఎమామెక్టిన్ బెంజోయేట్ 10 గ్రాములు లేదా క్లోరాంట్రానిలిప్రోల్ 18.5 శాతం 80 మి.లీ. లేదా లాంబ్డా సైహలోత్రిన్ 100 మి.లీ.ను ఎకరాకు పిచికారీ చేయాలని సూచించారు. వీటిని అన్ని మందులతో కలిపి కాకుండా వ్యవసాయ అధికారుల సూచనల మేరకు వినియోగించాలని తెలిపారు.
*ఆకు ఎండుతెగులు నివారణకు
ఆకు ఎండుతెగులు ఆశించినప్పుడు ట్రైకోడెర్మా హార్జియానం వంటి జీవ నియంత్రణ మందులను వినియోగించాలని సూచించారు. ఎకరాకు 1 గ్రాము చొప్పున నీటిలో కలిపి పిచికారీ చేయాలని తెలిపారు.
*ఆకుమచ్చ తెగులు నియంత్రణకు
ఆకుమచ్చ తెగులు సోకినప్పుడు ట్రైకోడెర్మా వంటి జీవ నియంత్రణ పద్ధతులతో పాటు కాపర్ ఆక్సీక్లోరైడ్ 2.5 గ్రాములు లేదా సాఫ్ (SAFF) 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు.
*దుంపకుళ్లు తెగులు నివారణకు
దుంపకుళ్లు తెగులు వల్ల దుంపలు కుళ్లిపోయి మొక్కలు వాడిపోయే అవకాశం ఉందన్నారు. ఎకరాకు 2 కిలోల మెటలాక్సిల్ + మాంకోజెబ్ కలిపి పిచికారీ చేయాలని, అలాగే పొలంలో నీరు నిల్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
*పంట దిగుబడి పెంచేందుకు పోషకాలు
పసుపు పంటలో వృద్ధి, దిగుబడి కోసం ఎకరాకు 10 గ్రాముల పోటాషియం నైట్రేట్‌ను లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో ఒకసారి, అలాగే 5 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్, 5 గ్రాముల జింక్ సల్ఫేట్‌ను లీటరు నీటికి కలిపి 15 రోజుల వ్యవధిలో ఒకసారి పిచికారీ చేయాలని ఆమె సూచించారు.రైతులు పంట పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, తెగుళ్లు లేదా పురుగుల ఉధృతి కనిపించిన వెంటనే సమీప ఉద్యానశాఖ అధికారులను సంప్రదించాలని ఆమె కోరారు. పురుగుమందులను లేబుల్ సూచనలు, అధికారుల సలహా మేరకే వినియోగించాలని సూచించారు. రిపోర్టర్ మాణిక్య చారి