పాఠశాలలో వసతులను పరిశీలించిన జిల్లా కలెక్టర్
హసన్ పర్తి ప్రతినిధి, హనుమకొండ జిల్లా హసన్ పర్తి లోని పీఎంశ్రీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలోని వసతులను జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ బుధవారం పరిశీలించారు.
పాఠశాలలో ఏర్పాటు చేసిన అటల్ టింకరింగ్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, సీసీ కెమెరాల పనితీరు, కిచెన్ షెడ్, కిచెన్ గార్డెన్ లో పెంచుతున్న మొక్కలు, పాఠశాల పై సమావేశాలు, యోగ శిక్షణకు ఏర్పాటు చేసిన షెడ్డును కలెక్టర్ పరిశీలించారు.
వాటికి సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ కు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుమా దేవి వివరించారు.
అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలను కలెక్టర్ సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలల్లో అనేక సదుపాయాలను కల్పిస్తుందని, వాటిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విద్యార్థులు కళాశాలకు క్రమం తప్పకుండా హాజరుకావాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో బాగా చదువుకుని ఉత్తమ ఫలితాలు సాధించాలన్నారు.
కార్యక్రమంలో స్థానిక సంస్థల జిల్లా ఇన్చార్జి అదనపు కలెక్టర్ శేషాద్రి, డీఈవో ఎల్.వి. గిరిరాజ్ గౌడ్, ఎంఈఓ శ్రీనివాస్, స్థానిక తహసిల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీవో సుమన వాణి, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సునీత, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.