మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఉత్కంఠ తొలగింది...
నరసన్నపేట, నవంబర్ 23: నరసన్నపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా కూటమి తెలుగుదేశం పార్టీ మద్దతుతో జామి ప్రత్యుషను ఖరారు చేశారు. సోమవారం నరసన్నపేటలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆమె అభ్యర్థిత్వాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా జామి ప్రత్యుషకు ఎమ్మెల్యే పార్టీ కండువా కప్పి అభినందించారు. స్థానిక రాజకీయ సమీకరణాలు, ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని పార్టీ అధిష్ఠానం, కూటమి నాయకత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.
సర్పంచ్ అభ్యర్థిగా ఎంపికైన జామి ప్రత్యుషకు పార్టీ నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బగ్గు అర్చన, యువ నాయకులు బగ్గు సునీల్ సీనియర్ నాయకులు, ఎంపీటీసీలు, వార్డు అభ్యర్థులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.