నామినేషన్ల పర్వం సమాప్తం.. బరిలో 916 మంది!
ప్యాపిలిలో ముగిసిన పంచాయతీ ఎన్నికల నామినేషన్లు
సర్పంచ్ స్థానాలకు 208, వార్డులకు 708 దాఖలు
ప్యాపిలి, మేజర్ న్యూస్: మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మూడు రోజులపాటు పది క్లస్టర్ల పరిధిలోని 31 గ్రామ పంచాయతీలకు వివిధ రాజకీయ పార్టీల మద్దతుదారులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు.మండలవ్యాప్తంగా 31 సర్పంచ్ స్థానాలకు 208 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు సమర్పించగా, వార్డు సభ్యుల స్థానాలకు 708 మంది బరిలో నిలిచారు. మొత్తంగా 916 నామినేషన్లు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.గత మూడు రోజులుగా సాగిన నామినేషన్ల కోలాహలంతో పల్లెల్లో ఎన్నికల వేడి రాజుకుంది. ప్రధాన పార్టీల నాయకులు తమ బలాబలాలను అంచనా వేసుకుంటూ వ్యూహాలకు పదును పెడుతున్నారు. నామినేషన్ల గడువు ముగియడంతో అభ్యర్థులంతా ఇక పరిశీలన, ఉపసంహరణ, ప్రచార వ్యూహాలపై దృష్టి సారించారు.