పాడైపోయిన మాంసాన్ని సీజ్ చేసిన మున్సిపల్ అధికారులు
జనగామ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్, జనగామ మున్సిపాలిటీ పరిధిలో ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా అధికారులు తనిఖీలు నిర్వహించి, పాడైపోయిన మాంసాన్ని గుర్తించి సీజ్ చేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే అవకాశం ఉన్న మాంసాన్ని విక్రయించకుండా తగిన చర్యలు చేపట్టారు. సీజ్ చేసిన పాడైపోయిన మాంసాన్ని నిబంధనల ప్రకారం సంబంధిత అధికారుల పర్యవేక్షణలో గుంతలో పాతిపెట్టడం జరిగింది. ప్రజలకు కలుషితమైన, నాణ్యత లేని మాంసం విక్రయించకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం ద్వారా ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు మున్సిపాలిటీ చర్యలు చేపట్టింది.ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు ప్రజలకు సూచించేది ఏమనగా మాంసం కొనుగోలు చేసే సమయంలో దాని తాజాదనం, నాణ్యతను పరిశీలించాలని, అపరిశుభ్ర వాతావరణంలో మాంసం విక్రయించే దుకాణాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. పాడైపోయిన మాంసం విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు.మాంసం విక్రయదారులు తప్పనిసరిగా పరిశుభ్రత ప్రమాణాలు పాటిస్తూ, ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.ప్రజల ఆరోగ్యానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించే వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.
రిపోర్టర్, నవీన్ చారి, జనగామ, జనగామ జిల్లా