ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. నేడే మున్సిపల్ నోటిఫికేషన్
అమరావతి:ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం రంగం సిద్ధం చేసింది. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం 11:30 గంటలకు మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ను ఎస్ఈసీ విడుదల చేయనుంది. ఈ షెడ్యూల్ ప్రకారం ఈనెల 16 నుంచి 18 వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా, ఈనెల 21లోపు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. అలాగే ఈనెల 28న పోలింగ్ నిర్వహించి, ఈనెల 30న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్లు సమాచారం. దీనికి కొనసాగింపుగా ఈనెల 19న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఈనెల 21 నుంచి 23 వరకు నామినేషన్లకు అవకాశం ఉండగా, ఈనెల 27 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుందని తెలుస్తోంది. దీనికి సంబంధించి నవంబర్ 3న పోలింగ్ జరిగి, నవంబర్ 5న కౌంటింగ్ నిర్వహించేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ ప్రకటనతో రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుంది.