దసరా ఉత్సవాల్లో భక్తుల భద్రతకు ఏఐ పరిజ్ఞానం : రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
ఇంద్రకీలాద్రి, మేజర్ న్యూస్: ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామివార్ల దేవస్థానం దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ నిర్వహణకు పోలీసు శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తోందని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. బుధవారం కనకదుర్గమ్మను దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఈ ఏడాది దసరా ఉత్సవాల్లో పోలీసు శాఖలో కృత్రిమ మేధా పరిజ్ఞానాన్ని ఎక్కువగా వినియోగిస్తున్నామని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో సంప్రదాయ పోలీసు బందోబస్తుతోపాటు సాంకేతిక నిఘా వ్యవస్థలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఏఐ ఆధారిత రద్దీ విశ్లేషణ ద్వారా భక్తుల రాకపోకలను అంచనా వేయడం, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలను గుర్తించడం, అవసరమైన చోట్ల పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేయడం వంటి చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. కొండపై, ఘాట్ రోడ్డు, క్యూలైన్లు, పార్కింగ్ ప్రాంతాల్లో సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేపడుతున్నామని తెలిపారు. డ్రోన్ల ద్వారా అందే దృశ్యాలను కేంద్రీకృత పర్యవేక్షణ వ్యవస్థతో అనుసంధానించి పరిస్థితులను సమీక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ గుర్తింపు కెమెరాలు, బూమ్ బ్యారియర్లను వినియోగిస్తూ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. పోలీసు కమాండ్ కంట్రోల్ కేంద్రం ద్వారా వివిధ ప్రాంతాల పరిస్థితులను సమన్వయంతో పర్యవేక్షిస్తూ, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్ మళ్లింపు, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందనకు సాంకేతిక సమాచారాన్ని ఉపయోగిస్తున్నట్లు వివరించారు. భక్తులు పోలీసుల సూచనలు పాటిస్తూ క్యూలైన్లలో క్రమశిక్షణతో ముందుకు సాగాలని, అనుమతి లేని మార్గాల్లోకి వెళ్లరాదని సూచించారు. పిల్లలు, వృద్ధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సమస్యలు ఎదురైతే సమీపంలోని పోలీసు సిబ్బందికి తెలియజేయాలని కోరారు. ఏఐ పరిజ్ఞానంతోపాటు మానవ పర్యవేక్షణ, క్షేత్రస్థాయి పోలీసు బందోబస్తు, వివిధ ప్రభుత్వ శాఖల సమన్వయంతో భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన అమ్మవారి దర్శనం కల్పించడమే లక్ష్యమని డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ఈవో శీనా నాయక్, నగర పోలీసు కమిషనర్ రాజశేఖరబాబు పాల్గొన్నారు.