నీటిని వృధా చేశారో.. ఫైన్.. కనెక్షన్ కట్ ..!
హైదరాబాద్:నగరంలో నీటి దుర్వినియోగానికి పాల్పడుతున్న వ్యాపార సంస్థలపై జలమండలి అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇందులో భాగంగా జూబ్లీహిల్స్లోని ప్రముఖ 'ఫోర్ ఫాదర్స్ పబ్'పై కఠిన చర్యలు తీసుకున్నారు. పబ్లో నీటిని వృథా చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు రంగంలోకి దిగిన జలమండలి అధికారులు తనిఖీలు నిర్వహించి, నిర్వాహకులకు రూ.20 వేల జరిమానా విధించారు.
అంతేకాకుండా, నిబంధనలకు విరుద్ధంగా నీటిని వృథా చేస్తున్నారన్న కారణంతో పబ్ తాగునీటి కనెక్షన్ను అధికారులు తక్షణమే తొలగించారు. అలాగే కమర్షియల్ వాటర్ ట్యాంకర్ల ద్వారా పబ్కు జరగాల్సిన నీటి సరఫరాను కూడా పూర్తిగా నిలిపివేశారు.
తాగునీటిని వృథా చేస్తే ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని జలమండలి హెచ్చరించింది. నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్లు, వాణిజ్య సముదాయాలు నీటిని అత్యంత పొదుపుగా వాడాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.