కాంగ్రెస్ తోనే పట్టణ అభివృద్ధి
-పురపాలిక చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి
మరిపెడ ప్రతినిధి,
డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోతు రాంచంద్రు నాయక్ నాయకత్వంలో మరిపెడ పట్టణం అభివృద్ధిలో దూసుకుపోతుందని మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి అన్నారు.మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో కొనసాగుతున్న సైడ్ డ్రైనేజీ పనులను చైర్‌పర్సన్ గురువారం మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డితో కలిసి పరిశీలించారు.వార్డులో ఇప్పటికే కొనసాగుతున్న డ్రైనేజీ పనుల పురోగతిని పరిశీలించిన చైర్‌పర్సన్, చేపట్టాల్సిన మిగిలిన పనులపై అధికారులతో చర్చించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా డ్రైనేజీ పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు, పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు.వర్షాకాలంలో మురుగు నీరు నిల్వ కాకుండా, ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య వసతులు అందేలా అవసరమైన ప్రాంతాల్లో సైడ్ డ్రైనేజీ పనులను చేపట్టాలని ఆమె పేర్కొన్నారు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యతనిస్తూ మున్సిపల్ పరిధిలో అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నామని తెలిపారు.ఈ పరిశీలనలో కౌన్సిలర్లు బోడ భాస్కర్, పానుగోతు రాములు, షేక్ ఆఫ్జల్, బోడ రవి, బోడ శ్రీను తదితరులు పాల్గొన్నారు.అనంతరం,రానున్న బతుకమ్మ పండుగను పురస్కరించుకొని నూతనంగా చేపట్టిన బతుకమ్మ ప్రాంగణంను కౌన్సిలర్లు గంట్ల గౌతమ్ రెడ్డి, గంట్ల సుజాత మహిపాల్ రెడ్డి లతో కలసి పరిశీలించారు. పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. అంతకుముందు కొండసముద్రం బతుకమ్మ ఘాట్ ను పరిశీలించి, చేపట్టాల్సిన పారిశుధ్య పనులను మున్సిపల్ సిబ్బందికి ఆదేశించారు.బతుకమ్మ వేడుకల్లో మహిళలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని కోరారు. వారివెంట కో ఆప్షన్ సభ్యుడు షేక్ అజీజ్, షేక్ తాజోద్దీన్,కుడితి నరసింహ రెడ్డి, ముదిరెడ్డి పవన్ రెడ్డి, వెర్మారెడ్డి సంతోష్ రెడ్డి, ముదిరెడ్డి నరేష్ రెడ్డి తదితరులు ఉన్నారు.