లాటరీ పద్ధతి ద్వారా పారదర్శకంగా మద్యం షాపుల లైసెన్సులు.... జిల్లా రెవెన్యూ అధికారి సుబ్బారావు..
అమలాపురం మేజర్ న్యూస్ :డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మద్యం షాపుల లైసెన్సుల కేటాయింపులో భాగంగా లాటరీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా రెవెన్యూ అధికారి డి. సుబ్బారావు తెలిపారు. గురువారం స్థానిక కలెక్టరేట్లోని గోదావరి భవనం నందు ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ శాఖ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో మద్యం లైసెన్స్ షాపుల ప్రక్రియను డిఆర్ఓ వి సుబ్బారావు, జిల్లా ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ అధికారి ఎం కుమ్మరేశ్వరన్ చేతుల మీదుగా లాటరీ పద్ధతి నిర్వహించారు.
జిల్లాలో మద్యం షాపుల లైసెన్సుల కేటాయింపునకు సంబంధించి నిబంధనల మేరకు లాటరీ విధానాన్ని నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. ఇందులో రాజమండ్రి పరిధిలో ఆలమూరు మండలంలో మండపేట ఒక షాపు, అమలాపురం పరిధిలో ఒక షాపు, రాజోలు పరిధిలో రెండు షాపులు, రామచంద్రపురం పరిధిలో మూడు షాపులు, ఆలమూరు పరిధిలో ఒక షాపుకు సంబంధించి లాటరీ ప్రక్రియ నిర్వహించినట్లు తెలిపారు.లాటరీ ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు డిఆర్ఓ పేర్కొన్నారు.
లాటరీలో ఎంపికైన అభ్యర్థులకు నిబంధనల ప్రకారం ప్రొవిజనల్ లైసెన్సులు జారీ చేయడం జరుగుతుందని తెలిపారు.ఇందుకు సంబంధించిన నిర్ణీత రుసుమును కూడా నిబంధనల మేరకు వసూలు చేయడం జరుగుతుందన్నారు.ఉమ్మడి జిల్లా ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ శాఖ అధికారి కుమరేశ్వరన్ మాట్లాడుతూ నూతనంగా అమలులోకి వచ్చిన చట్టాలు, నియమ నిబంధనలను లైసెన్సుదారులు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా మాత్రమే మద్యం షాపుల నిర్వహణ చేపట్టాలని, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.లాటరీ ప్రక్రియ మొత్తం అధికారుల పర్యవేక్షణలో నిబంధనలకు అనుగుణంగా నిర్వహించామని, లైసెన్సుల కేటాయింపులో పూర్తి పారదర్శకత పాటించినట్లు తెలిపారు.
ఈ సమావేశంలో ఎక్సైజ్ మరియు ప్రొహిబిషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు రామచంద్రపురం రాజోలు మమ్మిడివరం అమలాపురం పి శ్రీనివాస్ జి ఎం మురళి దుర్గాప్రసాద్ చిరంజీవి మరియు ఎస్సైలు హెడ్ కానిస్టేబుళ్లు కానిస్టేబుల్ కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.