జీపీ సిబ్బంది బాగుంటేనే ఊరు బాగుంటుంది … వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు
సూర్య కరీంనగర్ ప్రతినిధి/రామడుగు :జీపీ సిబ్బంది బాగుంటేనే ఊరు బాగుంటుందని వెలిచాల సర్పంచ్ వీర్ల నర్సింగారావు అన్నారు. రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీ సిబ్బందికి బుధవారం పీపీఈ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి పథంలో నడవాలన్నా, ప్రజలకు ప్రాథమిక సౌకర్యాలు సకాలంలో అందాలన్నా జీపీ సిబ్బంది పాత్ర అత్యంత కీలకం అన్నారు. సఫాయి కార్మికులు ఆరోగ్యంగా, ఉత్సాహంగా పని చేసినప్పుడే వీధులు శుభ్రంగా ఉంటాయని, తద్వారా గ్రామం రోగాల బారిన పడకుండా ఉంటుందని పేర్కొన్నారు. పంపు ఆపరేటర్లు బాధ్యతాయుతంగా పనిచేస్తేనే ఊరి ప్రజలందరికీ సకాలంలో స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని, పంచాయతీ కార్యదర్శి, ఇతర కార్యాలయ సిబ్బంది అందుబాటులో ఉండి, సమర్థవంతంగా పనిచేస్తేనే ప్రభుత్వ పథకాలు ప్రజలకు వేగంగా చేరి పరోక్షంగా ఊరి సమగ్రంగా అభివృద్ధి చెందుతుందన్నారు. సంక్షేమ పథకాలు, నిధులు ఎన్ని ఉన్నప్పటికీ, వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే జీపీ సిబ్బంది బాగున్నప్పుడే ఏ గ్రామమైనా ఆదర్శ గ్రామంగా మారుతుందన్నారు. అనంతరం జీపీ సిబ్బందికి ఎండీ జనరల్ ఫిజీషియన్ తో వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎల్లమ్మల వసంత, వార్డు మెంబర్లు పాల్గొన్నారు.