జాతీయ స్థాయిలో మారుమోగిన వెంకటాపురం
జాతీయస్థాయిలో మారుమోగిన వెంకటాపురం. ఫోటోగ్రాఫర్ చంద్రకళకు భారతీయ వారసత్వ దేశభక్తి పురస్కారం.
వెంకటాపురం నూగూరు, అక్టోబర్02,మేజర్ న్యూస్ సూర్య: ఒక చిన్న మండలం నుండి ఒక పెద్ద జాతీయ వేదికపైకి.. ములుగు జిల్లాలోని మారుమూల మండలం వెంకటాపురానికి చెందిన ఫోటోగ్రాఫర్ శ్రీరాముల సదాశివ ప్రసాద్ చంద్రకళ తన కెమెరా కంటితో జాతీయస్థాయిలో సత్తా చాటారు.ఆయన తీసిన ఒకే ఒక్క ఛాయాచిత్రం చంద్రకళ కు జాతీయ గుర్తింపును, వెంకటాపురానికి అరుదైన గౌరవాన్ని తెచ్చిపెట్టింది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ క్రియేటివిటీ అండ్ కల్చర్ కమిషన్,ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, గుంటూరు మరియు ఫోటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా (పిఏఐ) సంయుక్తంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహించారు.ఇందులో కఠిన నిబంధన విధించారు.ఆగస్టు 15వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల లోపు తీసిన చిత్రాలను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లు తమ చిత్రాలను పంపగా, అందులో చంద్రకళ చిత్రం తుది విజేతగా నిలిచింది.
వరి పొలం... పచ్చని పంట... బురదలో నిలబడిన రైతులు... వారి చేతిలో రెపరెపలాడుతున్న మువ్వన్నెల జాతీయ పతాకం. ఈ ఒక్క ఫ్రేమ్ లోనే రైతు శ్రమ,దేశభక్తి, భారతీయ వారసత్వం మూడూ కనిపిస్తాయి. "జై జవాన్... జై కిసాన్" నినాదానికి ప్రత్యక్ష రూపంగా నిలిచిన ఈ చిత్రం న్యాయనిర్ణేతలను ఆకట్టుకుంది.కేవలం ఫోటో కాదు,ఒక భావోద్వేగాన్ని బంధించారని జ్యూరీ ప్రశంసించింది.వెంకటాపురం మండల ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్షులుగా కొనసాగుతున్న చంద్రకళ (శ్రీరాముల సదాశివ ప్రసాద్), గతంలో రాష్ట్రస్థాయిలో అనేక ఫోటోగ్రఫీ పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు. మారుమూల ప్రాంతంలో ఉంటూ పరిమిత వనరులతోనే జాతీయస్థాయి పోటీల్లో నెగ్గడం విశేషం.ప్రతిభకు ప్రాంతంతో సంబంధం లేదని ఆయన మరోసారి నిరూపించారు.
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్యాంపస్ లో జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో చంద్రకళకు "భారతీయ వారసత్వము మరియు దేశభక్తి పురస్కారం" చంద్రకళకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కె. గంగాధరరావు, విశిష్ట అతిథులుగా మాజీ మంత్రి దొక్కా మాణిక్య వరప్రసాద్,ఆర్. మల్లికార్జునరావు, సభాధ్యక్షులుగా వీసీ ప్రొఫెసర్ ఎం. సురేష్ కుమార్, గౌరవ అతిథులుగా ప్రొఫెసర్ ఆర్. శివరామ ప్రసాద్, ప్రొఫెసర్ జి. సింహాచలం పాల్గొని అందజేశారు.చంద్రకళను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుండి ఇలాంటి ప్రతిభావంతులు రావడం గర్వకారణమని కొనియాడారు.
ఈ విజయంతో వెంకటాపురం మండల ఫోటోగ్రాఫర్లలో నూతనోత్సాహం నెలకొంది.