BREAKING
చెరువు కట్ట రహదారి అధ్వానం.. మరమ్మతులు ఎప్పుడు? జగ్గయ్యపేటలో త్వరలో ఎమర్జెన్సీ కేర్ క్లినిక్ ప్రారంభం! ఎమ్మెల్యే తాతయ్య చొరవతో 24/7 అత్యవసర వైద్య సేవలకు ముందడుగు అక్టోబర్ 25న ప్రారంభానికి సన్నాహాలు కలామ్ జీవితం ఆదర్శనీయం: వర్షపు నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలి – జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ జాతీయ సరస్ మేళా-2026ను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బాలీవుడ్‌లో మాయమవుతున్న పిల్లల సినిమాలు.. 'తారే జమీన్ పర్' అందించిన పరిశ్రమలో ఏమైంది? ఎన్నికల ప్రవర్తన నియామవాళి పాటించని ఉద్యోగిపై చర్యలు స్థానిక సంస్థల ఎన్నికలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు మహిళలు, బాలికలు, చిన్నారుల భద్రతకు జిల్లా పోలీసుల ప్రత్యేక అవగాహనా కార్యక్రమాలు రేపు మహబూబ్నగర్లో సాహిత్య సందడి ఓటీటీలోకి తేజ సజ్జా 'ది ట్రైటర్స్ తెలుగు'.. మొదటి మూడు ఎపిసోడ్ల స్ట్రీమింగ్ టైమ్, పూర్తి వివరాలు ఇవే! ఘనంగా బిగ్‌బాస్ బ్యూటీ ప్రేరణ సీమంతం వేడుక.. రష్మిక సాంగ్‌తో స్పెషల్ అట్రాక్షన్! ఓటీటీలోకి వచ్చిన తమిళ సస్పెన్స్ థ్రిల్లర్ 'ఎన్న విలై'.. తెలుగులోనూ స్ట్రీమింగ్! పుంగనూరు మునిసిఫల్ ఛైర్ పర్సన్ రేసులో సులోచన 'క్రేజీ కల్యాణం' ఈవెంట్‌లో కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్.. వేదికపైనే తల్లిదండ్రులను హగ్ చేసుకుని ఎమోషనల్!

ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి : నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక

Select Suryaa Now
ఎల్‌నినో ప్రభావంతో తలెత్తే నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలి : నారాయణపేట జిల్లా కలెక్టర్ ప్రియాంక

నారాయణపేట, సూర్యన్యూస్: 
జిల్లాలో ఎల్‌నినో ప్రభావం కారణంగా భూగర్భ జలమట్టాలు తగ్గి, నీటి ఎద్దడి తలెత్తే అవకాశాలున్న నేపథ్యంలో అన్ని శాఖల అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో విద్యుత్, వ్యవసాయ, నీటిపారుదల, మిషన్ భగీరథ, భూగర్భ జల వనరులు, పశుసంవర్ధక శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, అక్టోబర్ నెలలోనే పలు ప్రాంతాల్లో బోర్లు ఎండిపోతున్నట్లు క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందుతోందని తెలిపారు. గతంలో అనేక సంవత్సరాలుగా నీటిని అందించిన బోర్లు సైతం ప్రస్తుతం ఎండిపోతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. వేసవి నాటికి నీటి సమస్య మరింత తీవ్రతరం కాకుండా ఇప్పటి నుంచే అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. వేసవిలో తాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి వనరులు, వాటి సామర్థ్యం, నీటి సరఫరా పరిస్థితులు, సమస్యాత్మక గ్రామాలు, తండాలను గుర్తించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని సూచించారు. అవసరమైన నిధుల అంచనాలను రూపొందించి, వాటి సమీకరణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో నీటి సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి పరిష్కరించేందుకు పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత శాఖల సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. తాగునీటి సరఫరాకు సంబంధించిన సమస్యలపై శాఖల మధ్య సమన్వయంతో తక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భూగర్భ జలాల మట్టాలు తగ్గుతున్న నేపథ్యంలో బోర్ల రీఛార్జ్ నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. మంజూరైన పనులను వేగవంతం చేయడంతో పాటు, లక్ష్యాలకు అనుగుణంగా పనుల పురోగతి సాధించాలని ఆదేశించారు. బోర్ల రీఛార్జ్ నిర్మాణాలకు అవసరమైన సాంకేతిక సిబ్బందిని క్షేత్రస్థాయికి పంపించి, పనులు త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. నీటి వనరుల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, నీటి నిల్వలు, భూగర్భ జలమట్టాలపై ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులకు సూచించారు. తాగునీటి సరఫరా, సాగునీటి అవసరాలకు విద్యుత్ సరఫరా కీలకమని కలెక్టర్ పేర్కొన్నారు. విద్యుత్ సరఫరాలో తలెత్తే సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. నీటిపారుదల శాఖ అధికారులు నీటి వనరులు, సాగునీటి లభ్యతను నిరంతరం పర్యవేక్షిస్తూ, పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు.

*నీటి పొదుపుపై ప్రజలకు అవగాహన కల్పించాలి*

ప్రజలు తాగునీటిని పొదుపుగా వినియోగించేలా నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కలెక్టర్ తెలిపారు. వాహనాల శుభ్రతకు తాగునీటిని వృథా చేయడం, కుళాయిలను తెరిచి ఉంచడం వంటి చర్యలను నివారించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. పత్రికలు, సామాజిక మాధ్యమాల ద్వారా నీటి సంరక్షణపై విస్తృత ప్రచారం నిర్వహించాలని డీ పీ ఆర్ వో  రషీద్ ను ఆదేశించారు. నీటి లభ్యత తగ్గుతున్న పరిస్థితుల్లో వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు రైతులకు తగిన సూచనలు చేయాలని కలెక్టర్ తెలిపారు. తక్కువ నీటితో సాగు చేయగల పంటలపై అవగాహన కల్పించడంతో పాటు, పంటల వైవిధ్యీకరణకు ప్రోత్సాహం అందించాలని సూచించారు. రైతు వేదికలు, రైతు సదస్సుల ద్వారా నీటి వినియోగంలో పొదుపు, సాగు ప్రణాళికలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. వేసవి కాలంలో తలెత్తే నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ముందస్తు కార్యాచరణ ప్రణాళికల అమలుపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక స్పష్టం చేశారు. ఈ సమీక్షలో జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్, ఉద్యాన శాఖ అధికారి సాయిబాబా, విద్యుత్ శాఖ ఎస్ ఈ నవీన్, నీటి పారుదల శాఖ డీఈఈ సాల్మన్, పశు సంవర్ధక శాఖ అధికారిని  జగదీశ్వరీ, హౌసింగ్ పీడీ శంకర్, మిషన్ భగీరథ డీఈఈ రంగారావు, భూగర్భ జలవనరుల శాఖ అధికారి వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్ నారాయణపేట.