'క్రేజీ కల్యాణం' ఈవెంట్లో కన్నీళ్లు పెట్టుకున్న డైరెక్టర్.. వేదికపైనే తల్లిదండ్రులను హగ్ చేసుకుని ఎమోషనల్!
సూర్య ఎంటర్టైన్మెంట్ డెస్క్: అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్, అఖిల్ ఉడ్డెమారి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం 'క్రేజీ కల్యాణం'. బద్రప్ప గాజుల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నిర్మాత బూసం జగన్ మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సినిమా విడుదల తేది దగ్గర పడటంతో మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేశారు. అందులో భాగంగా నిర్వహించిన 'బరాత్' ఈవెంట్ అత్యంత ఘనంగా జరిగింది.
ఈ వేడుకలో పాల్గొన్న దర్శకుడు బద్రప్ప గాజుల తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వేదికపైనే తన తల్లిదండ్రులను ఆహ్వానించి, అందరి ముందే వారి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తపరిచారు. తనకు ఊహ తెలిసినప్పటి నుంచి తండ్రిని హగ్ చేసుకోలేదని, ఒకప్పుడు ఏ పని చేయకుండా గాలికి తిరిగిన తనను ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేశారని చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. వేదికపై తన తల్లిదండ్రులను మనస్ఫూర్తిగా హత్తుకుని వారి రుణం తీర్చుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.
దర్శకుడు బద్రప్ప మాట్లాడుతూ, తన చిన్నతనంలో తండ్రి ఎత్తుకుని ఉండవచ్చని, కానీ ఊహ తెలిసాక ఎప్పుడూ హగ్ చేసుకోలేదని చెప్పారు. తండ్రి ఇప్పటికీ పొలంలో ఎంతో కష్టపడి పనిచేస్తారని, ఇంట్లో ఎవరికి ఆరోగ్యం బాగోలేకపోయినా బర్రెలనే ఎక్కువగా పట్టించుకునే అమాయకత్వంతో ఉంటారని గుర్తుచేసుకున్నారు. ఇప్పటివరకు వారి సంతోషం కోసం తాను ఏమీ చేయలేదని, ఈ రోజే వారి కోసం సినిమా తీసి నీ పేరు నిలబెడతానని వేదికగా మాటిచ్చారు. దర్శకుడి నిజాయితీ మరియు భావోద్వేగపూరిత మాటలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి హృదయాలను తడిమేశాయి.
Also Read: పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. ప్రత్యేక పూజలు చేసిన 'విరోష్' జంట!