దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి
* ఆలేరులో కరపత్రం ఆవిష్కరించిన ఎమ్మార్పీఎస్ నాయకులు
ఆలేరు, మేజర్ న్యూస్: రాష్ట్ర ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 5వ తేదీన యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరు నుంచి భువనగిరి వరకు నిర్వహించనున్న బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు పిలుపునిచ్చారు.ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గౌరవ మేడి పాపన్న ఆదేశాల మేరకు,రాష్ట్ర అధ్యక్షులు కేదాసి మోహన్ పిలుపు మేరకు నిర్వహించనున్న బైక్ ర్యాలీకి సంబంధించిన కరపత్రాలను ఆలేరు మండల కేంద్రంలో ఆవిష్కరించారు.ఆలేరు మండల అధ్యక్షులు ముద్దేపాక కృష్ణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కరపత్రాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆలేరు మండల ఇన్‌చార్జి బైరపాక సురేష్ మాదిగ మాట్లాడుతూ జిల్లాలో నిర్వహించనున్న బైక్ ర్యాలీలో మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.దళితులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.అంబేద్కర్ అభయహస్తం అమలు చేయడంతో పాటు,దళితుల అసైన్డ్ భూములకు పట్టాలు కల్పించాలని,అర్హులైన పేదలకు పక్కా ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ఆయన కోరారు. ఎస్సీ,ఎస్టీ హాస్టళ్లలో విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలని,నాణ్యమైన విద్యతో పాటు మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా యాదగిరిగుట్టలో ఐదు ఎకరాల స్థలంలో మాదిగ భవనం నిర్మించాలని ప్రభుత్వాన్ని కోరారు. దళితుల సమస్యల పరిష్కారం కోసం చేపడుతున్న బైక్ ర్యాలీకి మాదిగలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి సంగీ స్వామి,ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గ్యార లాజర్,ముద్దేపాక శ్రీను, బోడ విజయ్, ముద్దేపాక రమేష్,ముద్దేపాక ఎల్లయ్య, సంగీ అనిల్, గ్యార సుదర్శన్, ముద్దేపాక శివ, ఇస్సాకు, సుంకరి బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.