చేవెళ్లలో 11 నుంచి దసరా నవరాత్రి ఉత్సవాలు
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని శ్రీ బాలాజి లక్ష్మీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి సందర్భంగా అక్టోబర్ 11 నుంచి దశమి వరకు అక్టోబర్ 20 వరకు వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. ఉత్సవాల మొదటి రోజు అక్టోబర్ 11న పంచామృతాభిషేకం, పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, లక్షార్చన, సహస్ర దీపాలంకరణ, కలశ స్థాపన, వేదపారాయణం ప్రారంభం కాగా, రాత్రి పల్లకి సేవ నిర్వహిస్తారు. తదుపరి రోజుల్లో చంద్రప్రభ, హంస, సింహ, శేష, గజ, రథోత్సవం, హనుమంత, గరుడ వాహన సేవలు భక్తులకు ఆకట్టుకోనున్నాయి. అక్టోబర్ 20న విజయదశమి సందర్భంగా మధ్యాహ్నం చక్రతీర్థం (తెప్పోత్సవం), రాత్రి అశ్వవాహన సేవ, శమీపూజ నిర్వహించనున్నారు. ప్రతి రోజు విష్ణు లలితా సహస్రనామ పారాయణం, సహస్ర దీపాలంకరణతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.
ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆశీస్సులు పొందాలని వంశపారంపర్య ధర్మకర్త పూజారి రాఘవేంద్రాచారి, కార్యనిర్వహణ అధికారి టి. నరేందర్ భక్తులకు విజ్ఞప్తి చేశారు.
(చేవెళ్ల - మేజర్ న్యూస్)