భూముల రీ సర్వే పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలి: అదనపు కలెక్టర్ వెంకటాచారి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (అక్టోబర్ 15): జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియను నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వెంకటాచారి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో తహసీల్దార్లు, డిప్యూటీ తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, గ్రామపంచాయతీ అధికారులు, సర్వేయర్లకు భూముల రీ సర్వేపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ వెంకటాచారి మాట్లాడుతూ… శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. భూముల రీ సర్వేను నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారం చేపట్టాలని, సర్వే సమయంలో భూముల సరిహద్దులు, విస్తీర్ణం, అందుబాటులో ఉన్న రెవెన్యూ రికార్డులు, సంబంధిత వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. రీ సర్వే నిర్వహణలో అనుసరించాల్సిన విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రికార్డుల నిర్వహణతో పాటు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు.రీ సర్వే ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలించాలని, అధికారులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. సర్వేకు సంబంధించిన సాంకేతిక అంశాలు, విధివిధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ మధుసూదన్తో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.