అక్టోబర్ 2న జర్నలిస్టుల డిమాండ్ల సాధనకు నిరసన
నారాయణపేట, సూర్యన్యూస్: ఇండియాన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు జర్నలిస్టుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం అక్టోబర్ 2 (శుక్రవారం) గాంధీ జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు టీయూడబ్ల్యూజే (ఐజేయూ) నారాయణపేట జిల్లా అధ్యక్షులు కోయిలకొండ నారాయణరెడ్డి తెలిపారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జర్నలిస్టుల పక్షాన ఏళ్ల తరబడి ఐజేయూ పోరాటం చేస్తుందని, ఎంతో మంది జర్నలిస్టు కుటుంబాలకు అండగా నిలిచిందని గుర్తుచేశారు. మరోసారి జర్నలిస్టుల సంక్షేమం, హక్కులు, రక్షణ, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం మన గళాన్ని బలంగా వినిపించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఒక్కొక్కరి గళం ఒక డిమాండ్ అయితే..జర్నలిస్టుల ఐక్య గళం ఒక ఉద్యమంగా మారుతుందని అన్నారు. అందుకుగాను సభ్యులందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కమిటీ పిలుపునిస్తోందని పేర్కొన్నారు. నారాయణపేట జిల్లాలోని కోస్గి, గుండుమాల్, మద్దూర్, కొత్తపల్లి, దామరగిద్ద, నారాయణపేట, ధన్వాడ, మరికల్, నర్వ, మక్తల్, మగనూరు, కృష్ణ, ఉట్కూరు ప్రాంతాల సభ్యులు అక్టోబర్ 2న ఉదయం 10:30 గంటలకు నారాయణపేట ప్రెస్‌క్లబ్ వద్దకు చేరుకోవాలని చెప్పారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే నిరసన కార్యక్రమంలో సభ్యులందరూ తప్పనిసరిగా పాల్గొని జర్నలిస్టుల హక్కుల కోసం మన ఐక్యతను చాటాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో నేషనల్ కౌన్సిల్ సభ్యులు నక్క శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి శివశంకర్, జిల్లా ఉపాధ్యక్షులు హన్మంతు, వెంకట్, గురు ప్రసాద్, కార్యదర్శులు అజీజ్ అహ్మద్ ఖాన్, విటోబా, అశోక్, మహమ్మద్ తఖీ, కోశాధికారి మధుకర్, ప్రచార కార్యదర్శి ఎస్.సురేష్, విద్యాశాఖ కన్వీనర్ రాజేష్ కుమార్, హెల్త్ కన్వీనర్ సంజీవ ప్రకాష్, లీగల్ సెల్ కన్వీనర్: బాలరాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు శేఖర్, నర్సింహులు, వీరేష్, మన్సూర్ అహ్మద్, వీరణ్ణ, ఎల్లారెడ్డి, సురేష్, ఆంజనేయులు, రమేష్, రమేష్ గౌడ్ పాల్గొన్నారు.
-- రాజేష్ కుమార్, సూర్య రిపోర్టర్, నారాయణపేట