టమోటా పంటను పరిశీలించిన మంత్రి పయ్యావుల కేశవ్
అనంతపురం బ్యూరో: ఉరవకొండ నియోజకవర్గంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గురువారం పర్యటించారు. పర్యటనలో భాగంగా కూడేరు మండలం ఎంఎం.హళ్లి గ్రామ సమీపంలోని టమోటా పంటను మంత్రి పరిశీలించారు.
టమోటా సాగు విధానం, ప్రస్తుత దిగుబడి పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మంత్రి క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకున్నారు. పంట పొలంలో పనిచేస్తున్న వ్యవసాయ కూలీలతో మంత్రి నేరుగా మాట్లాడి వారి పని పరిస్థితులు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు, వ్యవసాయ పనులకు సంబంధించిన అంశాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. రైతులకు సంబంధించిన సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వ్యవసాయ రంగ అభివృద్ధికి అవసరమైన చర్యలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు.
పంటల పరిస్థితులను స్వయంగా పరిశీలించడం ద్వారా రైతులు, వ్యవసాయ కూలీల సమస్యలను తెలుసుకునే అవకాశం కలుగుతుందని మంత్రి తెలిపారు. అనంతరం సంబంధిత అధికారులతో వ్యవసాయ పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, రైతులు, వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు.