అడ్వాన్స్ వద్దు.. బకాయి జీతం చెల్లించండి!
సూర్య,కాగజ్నగర్:పండుగ వేళైనా తమ కుటుంబాలతో సంతోషంగా గడపలేని పరిస్థితి తమకు ఎదురైందని కాగజ్నగర్ పురపాలిక పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. దసరాకు అడ్వాన్సుగా రూ.5 వేల చొప్పున అందజేస్తామని మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, చైర్పర్సన్ షాహిన్ సుల్తానా ప్రకటించడంపై అసంతృప్తి వ్యక్తం చేసిన కార్మికులు.. ముందుగా తమకు రావాల్సిన నెల వేతన బకాయిని చెల్లించాలని డిమాండ్ చేశారు.బుధవారం రాత్రి బల్దియా కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన కార్మికులు అక్కడే నిద్రపోయారు. గురువారం కూడా బకాయి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ విధులను బహిష్కరించి ఆందోళన కొనసాగించారు. పండుగ సమయంలో చేతిలో డబ్బులు లేకపోతే కుటుంబ అవసరాలు ఎలా తీర్చుకోవాలని వారు ప్రశ్నించారు. అడ్వాన్స్ తో పాటు పెండింగ్లో ఉన్న నెల జీతాన్ని వెంటనే చెల్లిస్తేనే తమ కుటుంబాలతో పండుగను ఆనందంగా జరుపుకోగలమని స్పష్టం చేశారు.
కార్మికులకు మద్దతు:పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనకు పురపాలిక వైస్ చైర్పర్సన్ డాక్టర్ కొత్తపల్లి అనిత శ్రీనివాస్తో పాటు భారత రాష్ట్ర సమితికి చెందిన పలువురు కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. కార్మికుల వేతన బకాయిల సమస్యను పరిష్కరించి, పండుగకు ముందే వారికి రావాల్సిన వేతనాలు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్యం శ్రమించే పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల్లో పండుగ వెలుగులు నింపాలంటే వారి వేతన బకాయిలను సకాలంలో చెల్లించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.