ఆసరా కోసం.. వృద్ధురాలి అవస్థలు!
-కుర్చీలో కూర్చోబెట్టి కార్యాలయానికి తీసుకొచ్చిన కుటుంబ సభ్యులు
ఆసరా పింఛన్ లైవ్ అథెంటికేషన్ కోసం ఓ వృద్ధురాలు తీవ్ర అవస్థలు పడాల్సి వచ్చింది. స్వయంగా నడవలేని ఆమెను కుటుంబ సభ్యులు కుర్చీలో కూర్చోబెట్టి రాజేంద్రనగర్ జోనల్ కార్యాలయానికి మోసుకొచ్చారు. ఈ దృశ్యం అక్కడికి వచ్చిన వారిని కలచివేసింది.
నడవలేని వృద్ధులు, దివ్యాంగులు అథెంటికేషన్ కోసం కార్యాలయాలకు వచ్చి ఇబ్బందులు పడకుండా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. వీల్‌చైర్ సదుపాయం కల్పించడంతోపాటు అవసరమైన వారికి ఇంటి వద్దే అథెంటికేషన్ చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వృద్ధులు, దివ్యాంగుల పట్ల అధికారులు మానవతా దృక్పథంతో స్పందించాలని కోరుతున్నారు.
(రాజేంద్రనగర్ - మేజర్ న్యూస్)