ఆదివాసీ మహిళల స్వయం ఉపాధికి అండగా ఉంటాం: ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
సూర్య తెలంగాణ డెస్క్: ఆదివాసీ మహిళలకు నైపుణ్య శిక్షణతో పాటు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే దిశగా క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ భరోసా ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలంలోని గండుగులపల్లి క్యాంపు కార్యాలయంలో గిరిజన మహిళలు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న తమ ఉత్పత్తులకు సరైన మార్కెటింగ్ సదుపాయం కల్పించాలని ఈ సందర్భంగా వారు కోరారు.
వివిధ ప్రభుత్వ సంస్థలు, గిరిజన సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో తాము శిక్షణ పొంది నైపుణ్యాలు సాధించినప్పటికీ, మార్కెటింగ్ లేకపోవడంతో ఉపాధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో ఇబ్బందులు పడుతున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వపరంగా తగిన సహాయ సహకారాలు అందితే తాము ఆర్థికంగా నిలదొక్కుకోవడమే కాకుండా, తోటి మహిళలకు కూడా ఉపాధి కల్పించగలమని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళల సమస్యలను సానుకూలంగా విన్న ఎమ్మెల్యే, సంబంధిత శాఖల అధికారులతో చర్చించి సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.