రైల్వే స్టేషన్లు, ట్రాక్‌ల సమీపంలోని మద్యం దుకాణాలను తరలించండి
సూర్య జాతీయ డెస్క్: రైల్వే స్టేషన్లు, రైల్వే ట్రాక్‌ల సమీపంలో నిర్వహిస్తున్న 43 ప్రభుత్వ మద్యం దుకాణాలను (టాస్మాక్) తక్షణమే వేరే ప్రాంతాలకు తరలించాలని దక్షిణ రైల్వే అధికారులు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రయాణికుల భద్రత, ముఖ్యంగా మహిళలు, పిల్లల రక్షణ మరియు రైల్వే ఆస్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కీలక ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు అధికారులు వెల్లడించారు. రైల్వే ప్రాంగణాలకు అత్యంత సమీపంలో ఉన్న మద్యం దుకాణాల వల్ల స్టేషన్ పరిసరాల్లో అసాంఘిక కార్యకలాపాలు పెరుగుతున్నాయని, మద్యం మత్తులో పలువురు రైలు పట్టాలపైకి రావడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని రైల్వే శాఖ తన లేఖలో ఆందోళన వ్యక్తం చేసింది.
చెన్నై, తిరుచ్చి, మధురై, సేలం వంటి కీలక రైల్వే డివిజన్ల పరిధిలో స్టేషన్లకు కూతవేటు దూరంలో లేదా లెవల్ క్రాసింగ్‌లు, రైలు ట్రాక్‌ల పక్కనే ఈ దుకాణాలు ఉన్నట్లు దక్షిణ రైల్వే సమగ్ర సర్వే ద్వారా గుర్తించింది. సాయంత్రం వేళల్లో ఈ దుకాణాల వద్ద తీవ్ర రద్దీ నెలకొనడంతో పాటు మద్యం సేవించిన వ్యక్తులు స్టేషన్లలో తిరుగుతూ నిరీక్షిస్తున్న ప్రయాణికులకు తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్నారని ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అంతేకాకుండా మద్యం మత్తులో పట్టాలు దాటే క్రమంలో నిత్యం పలువురు రైళ్ల కింద పడి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ఖాళీ మద్యం సీసాలను ట్రాక్‌లపై విసిరేయడం ద్వారా రైల్వే సిబ్బంది నిర్వహణ పనులకు సైతం ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు.
రైల్వే పరిసరాలను సురక్షితమైనవిగా మరియు నేర రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దేందుకు ఈ 43 టాస్మాక్ దుకాణాలను తక్షణమే జనసంచారం తక్కువగా ఉండే ఇతర ప్రదేశాలకు తరలించేలా టాస్మాక్ యాజమాన్యానికి తగిన ఆదేశాలు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత అధికారులను దక్షిణ రైల్వే కోరింది. ప్రయాణికుల రాకపోకలకు ఆటంకం కలగకుండా, రైల్వే స్టేషన్లలో ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు రాష్ట్ర యంత్రాంగం సహకరించాలని రైల్వే రక్షణ దళం (ఆర్పీఎఫ్) వర్గాలు స్పష్టం చేశాయి. ఈ అంశంపై తమిళనాడు ప్రభుత్వం త్వరలోనే సమీక్షించి తగిన నిర్ణయం తీసుకునే అవకాశముందని భావిస్తున్నారు.