స్వశక్తితో ఎదగాలి.. మహిళలకు అండగా నిలవాలి
కనిగిరిలో 304 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ
ఎమ్మెల్యే ఉగ్ర సేవలు అభినందనీయం: మంత్రులు గొట్టిపాటి, బీసీ జనార్దన్‌రెడ్డి
పామూరు, మేజర్ న్యూస్ :
కనిగిరి అమరావతి గ్రౌండ్‌లో జనని చారిటబుల్ ట్రస్ట్, ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ పొందిన 304 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర మారిటైం చైర్మన్ దామచర్ల సత్య లబ్ధిదారులకు కుట్టు మిషన్లను అందజేశారు. మహిళలు స్వశక్తితో ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమని మంత్రులు గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ ద్వారా మహిళలు స్వావలంబన సాధించడంతో పాటు కుటుంబ ఆర్థిక పరిస్థితికి చేయూతనందించే అవకాశం ఏర్పడుతుందని వారు తెలిపారు. మహిళలు తమకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్‌కుమార్‌రెడ్డి, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎలక్షన్‌బాబుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు, జనని చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, మహిళా లబ్ధిదారులు పాల్గొన్నారు