రోమా సమాజం గుర్తింపు, ఆత్మగౌరవంపై ప్రత్యేక దృష్టి
సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: ప్రపంచ సంస్కృతిపై రోమా సమాజం విశేష ముద్ర వేసినప్పటికీ ఆ వర్గం కథలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉందని రొమేనియన్-రోమా దర్శకురాలు అలీనా సెర్బన్ అభిప్రాయపడ్డారు. గోవాలో జరుగుతున్న 57వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ 2026లో మిడ్ ఫెస్ట్ చిత్రంగా ఎంపికైన తన సినిమా ఐ మ్యాటర్ గుర్తింపు, కుటుంబం, ఆత్మగౌరవం మరియు గతాన్ని దాటి కొత్త భవిష్యత్తును నిర్మించుకునే ఆశలను ఆవిష్కరిస్తుందని తెలిపారు. ఇఫీ వేదికగా జరిగిన మీడియా సమావేశంలో అలీనా సెర్బన్‌తో పాటు ప్రధాన నటీమణులు డెనిసా ఫార్కాస్, వనెస్సా డాన్సియా పాల్గొని సినిమా రూపకల్పన నేపథ్యం, సామాజిక మూసధోరణులను సవాలు చేయాల్సిన ఆవశ్యకతపై మాట్లాడారు. రొమేనియన్, రోమా భాషల్లో తెరకెక్కిన ఈ బహుళ భాషా చిత్రానికి ఇఫీ వేదికగా భారత్‌లో తొలి ప్రదర్శన లభించింది. రొమేనియా, జర్మనీ, బెల్జియం సంయుక్త నిర్మాణంలో రూపొందిన ఈ కథ, తాను ఇన్నాళ్లుగా ఇల్లుగా భావించిన అనాథాశ్రమం నుంచి బయటకు వచ్చే రెబెకా అనే యువతి చుట్టూ తిరుగుతుంది. జైలు నుంచి విడుదల కానున్న తన తండ్రితో కలిసి కొత్త కుటుంబాన్ని ఏర్పరచుకోవాలని కలలు కనే రెబెకాకు, నటన అభ్యసించేందుకు విశ్వవిద్యాలయంలో సీటు లభించడం జీవితంలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుంది.
రోమా సమాజాన్ని ఏకపక్షంగా కాకుండా మానవత్వంలోని విభిన్న కోణాలను చూపడమే తన లక్ష్యమని అలీనా సెర్బన్ స్పష్టం చేశారు. మనిషిగా గుర్తింపు పొందే అర్హత ఎవరికి ఉందనే ప్రశ్నను ఈ సినిమా లేవనెత్తుతుందని, మానవత్వంలోని అనేక పొరలను ఆవిష్కరించాలని తాను ప్రయత్నించానని పేర్కొన్నారు. ఫ్లెమెన్కో వంటి కళారూపాల ద్వారా విశ్వ సంస్కృతిని ప్రభావితం చేసినప్పటికీ రోమా సమాజం ఇప్పటికీ సామాజికంగా వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటోందని, పక్కనే ఉన్నా ప్రజలు తమను సరిగా అర్థం చేసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెనుకబడిన వర్గాల యువత తాము పుట్టిన పరిస్థితులకు మించి ఎదగగలమనే నమ్మకాన్ని కల్పించాలని, ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ ఒక చోటు ఉంటుందనే సందేశాన్ని ఇవ్వాలని ఈ కథను రూపొందించినట్లు చెప్పారు. ఇఫీలో తన సినిమా ప్రదర్శితమవడం సంతోషంగా ఉందని, భారత్‌కు రావడం తనకు సొంత ఇంటికి వచ్చిన అనుభూతిని కలిగిస్తోందని తెలిపారు.
రెబెకా పాత్ర పోషించిన నటి డెనిసా ఫార్కాస్ మాట్లాడుతూ, ఈ సినిమా తన వ్యక్తిగత ప్రయాణంలో, తన గుర్తింపు పట్ల తన దృక్పథంలో గొప్ప మార్పు తీసుకువచ్చిందని చెప్పారు. తొలుత తన రోమా మూలాలను బయటకు చెప్పుకోవడానికి సంకోచించినప్పటికీ, ఈ పాత్ర పోషించిన తర్వాత తన సమాజాన్ని సానుకూల దృష్టితో చూడగలిగానని వెల్లడించారు. తన గుర్తింపు పట్ల గతంలో ఉన్న సంకోచాన్ని అధిగమించి, రోమా వారసత్వాన్ని గర్వంగా స్వీకరించేలా ఈ చిత్రం చేసిందని, ముఖ్యంగా ఆ సమాజంలోని పిల్లల అనుభవాలకు ప్రాధాన్యం దక్కడం ఆనందంగా ఉందని తెలిపారు. సామాజిక పక్షపాతాలను ప్రశ్నిస్తూ, అట్టడుగు వర్గాల గొంతును ప్రధాన స్రవంతిలోకి తీసుకురావడంలో సినిమా పాత్రను ఈ చర్చా వేదిక స్పష్టంగా చాటిచెప్పింది.