ఈసీ ఐటీ విభాగం పర్యవేక్షణపై ఎలాంటి మార్పు లేదు
సూర్య నేషనల్ డెస్క్, న్యూఢిల్లీ: భారత ఎన్నికల సంఘం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం డైరెక్టర్ జనరల్ సీమా ఖన్నా పర్యవేక్షణ, రిపోర్టింగ్ విధానంపై వస్తున్న ఊహాగానాలకు కేంద్ర ఎన్నికల సంఘం తెరదించింది. పనుల కేటాయింపు ఉత్తర్వులను సవరించినప్పటికీ, ఐటీ చీఫ్ పర్యవేక్షణా నిర్మాణంలో ఎలాంటి మార్పు చోటుచేసుకోలేదని ఎన్నికల సంఘం సీనియర్ అధికారి ఒకరు స్పష్టం చేశారు.
వివాదం నేపథ్యం – అంతర్గత విభేదాలు
ఈ వివాదం జూలై 28 నాటి ఉత్తర్వుల నుంచి మొదలైంది. అప్పటివరకు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సంజయ్ కుమార్ పర్యవేక్షణలో పనిచేసిన సీమా ఖన్నాను.. సంజయ్ కుమార్ బదిలీ అనంతరం నేరుగా కమిషన్‌కే రిపోర్ట్ చేయాల్సిందిగా సీనియర్ డిప్యూటీ ఈసీ నితేశ్ వ్యాస్ గార్గ్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ ఉత్తర్వులపై ఎన్నికల కమిషనర్లు ఎస్.ఎస్. సంధూ, వివేక్ జోషి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ నిర్ణయాన్ని నిలిపివేశారు. ఎన్నికల నమోదు అధికారుల చట్టబద్ధమైన అధికారాలు ఐటీ వ్యవస్థల ద్వారా కేంద్రీకృతం అవుతున్నాయన్న ఆరోపణల నేపథ్యంలో ఐటీ విభాగంపై కమిషనర్ల పర్యవేక్షణ తొలగించడం వివాదాస్పదమైంది.
ఈసీ వివరణ – నూతన పర్యవేక్షణ బాధ్యతలు
జూలై నాటి ఉత్తర్వులు వాస్తవంగా ఎన్నడూ అమల్లోకి రాలేదని, ఐటీ విభాగంపై డిప్యూటీ ఈసీ పర్యవేక్షణ ఎప్పుడూ రద్దు కాలేదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. సంజయ్ కుమార్ బదిలీ తర్వాత లింక్ ఆఫీసర్‌గా వ్యవహరించిన గార్గ్ పర్యవేక్షణలోనే ఆమె కొనసాగారని, తాజాగా ఎన్నికల సంఘంలో డిప్యూటీ ఈసీగా బాధ్యతలు చేపట్టిన ప్రకాశ్ రాజ్‌పురోహిత్‌కు సీమా ఖన్నా రిపోర్ట్ చేస్తారని అధికారులు వెల్లడించారు. తద్వారా ఐటీ విభాగంపై పాలనాపరమైన నియంత్రణ, పర్యవేక్షణ శ్రేణి యథావిధిగా కొనసాగుతోందని పేర్కొన్నారు.