ఏఐటీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సానియా, భూపతి
సూర్య స్పోర్ట్స్ డెస్క్, న్యూఢిల్లీ: భారత టెన్నిస్ రంగంలో సరికొత్త శకానికి నాంది పడింది. దిగ్గజ టెన్నిస్ క్రీడాకారులు సానియా మీర్జా, మహేష్ భూపతి అఖిల భారత టెన్నిస్ సంఘం (AITA) ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి ప్రతిభావంతులైన విశిష్ట క్రీడాకారుల (Sportspersons of Outstanding Merit - SOM) కోటా కింద ఎన్నికయ్యారు. జాతీయ క్రీడా పరిపాలనా సంస్కరణలు, నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా క్రీడా సమాఖ్యలలో మాజీ అంతర్జాతీయ అథ్లెట్లకు నిర్ణయాధికారాల్లో కీలక భాగస్వామ్యం కల్పించే ప్రక్రియలో భాగంగా వీరిద్దరూ పాలకమండలిలోకి అడుగుపెట్టారు.
జనరల్ బాడీ ఎన్నికల ద్వారా నామినేషన్
ఏఐటీఏ సవరించిన నిబంధనావళి ప్రకారం నలుగురు ఎస్‌ఓఎం ప్రతినిధులను జనరల్ బాడీకి, వారిలో ఇద్దరిని కీలకమైన 15 మంది సభ్యుల ఎగ్జిక్యూటివ్ కమిటీకి కేటాయించాల్సి ఉంటుంది. తొలుత జరిగిన జనరల్ బాడీ పోలింగ్‌లో మహేష్ భూపతి 19 ఓట్లు, సానియా మీర్జా 18 ఓట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచారు. వీరితో పాటు మాజీ ఆటగాళ్లు అశుతోష్ సింగ్, షాలిని ఠాకూర్ చావ్లా కూడా ఎస్‌ఓఎం ప్రతినిధులుగా జనరల్ బాడీకి ఎన్నికయ్యారు. అనంతరం గురువారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎన్నికల్లో భూపతి, సానియాలకు నేరుగా పాలక మండలి సభ్యులుగా ప్రాతినిధ్యం దక్కింది.
భారత టెన్నిస్ అభివృద్ధికి కృషి – సానియా మీర్జా
ఎన్నికల అనంతరం సానియా మీర్జా స్పందిస్తూ.. "భారత టెన్నిస్ భవిష్యత్తును మరింత మెరుగుపరచడమే మా ప్రధాన లక్ష్యం. క్రీడాకారులుగా మైదానంలో సంపాదించిన అనుభవాన్ని పరిపాలనలో ఉపయోగించి, యువ క్రీడాకారులకు అవసరమైన మౌలిక వసతులు, సరైన శిక్షణ మరియు పోటీ వాతావరణం కల్పించేందుకు కృషి చేస్తాం" అని పేర్కొన్నారు. ఆరు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు, ప్రపంచ నంబర్ 1 ర్యాంకింగ్ సాధించిన సానియా.. 12 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచి సుదీర్ఘ అంతర్జాతీయ అనుభవం కలిగిన మహేష్ భూపతితో కలిసి పాలనా బాధ్యతల్లోకి రావడం భారత టెన్నిస్ ఎదుగుదలకు ఎంతగానో దోహదపడుతుందని క్రీడా వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.