ఫ్రాన్స్‌లో దేశవ్యాప్త సమ్మె, భారీ నిరసనలు
సూర్య ఇంటర్నేషనల్ డెస్క్, పారిస్: ఫ్రాన్స్‌లో కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు చేపట్టిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. నిత్యావసరాల ధరల పెరుగుదల, జీవన వ్యయ సంక్షోభం, పెన్షన్లు, వేతనాల పెంపు డిమాండ్లతో కార్మిక సంఘాల సమాఖ్య పిలుపునిచ్చిన ఈ సమ్మెతో ఫ్రాన్స్ వ్యాప్తంగా సాధారణ జనజీవనం పూర్తిగా స్తంభించింది. రాజధాని పారిస్ సహా ప్రధాన నగరాల్లో లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి భారీ ర్యాలీలు నిర్వహించారు. కార్మికుల ఆందోళనల కారణంగా పారిస్‌లోని ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ఆకర్షణ ఈఫిల్ టవర్‌ను సైతం అధికారులు తాత్కాలికంగా మూసివేయాల్సి వచ్చింది.
రైళ్లు, పాఠశాలలు బంద్.. స్తంభించిన రవాణా వ్యవస్థ
ఫ్రాన్స్ ప్రభుత్వ రంగ రైల్వే నెట్‌వర్క్ ఎస్‌ఎన్‌సీఎఫ్ , మెట్రో మరియు ప్రాంతీయ రైళ్ల (RER) రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పలు మార్గాల్లో రైళ్లు పూర్తిగా రద్దవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనడంతో దేశంలోని దాదాపు మూడో వంతు హైస్కూళ్లు మూతపడ్డాయి. విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో తరగతులు నిలిచిపోయాయి. విద్యా నిధుల కొరతపై గత సెప్టెంబర్ నుంచి కొనసాగుతున్న విద్యార్థుల అసంతృప్తికి తాజా కార్మిక పోరాటం తోడవడంతో ఆందోళనల తీవ్రత రెట్టింపైంది.
ఆకాశాన్నంటుతున్న ధరలు – కార్మిక సంఘాల ఆగ్రహం
"ఇంధనం, ఆహార పదార్థాలు, అద్దెలు, గ్యాస్, విద్యుత్ బిల్లులు.. ఇలా అన్నీ పెరిగిపోతున్నాయి, కానీ వేతనాలు, పెన్షన్లు మాత్రం పెరగడం లేదు" అని సీజీటీ సహా ప్రధాన యూనియన్లు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో ఆవేదన వ్యక్తం చేశాయి. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలని, సంపన్నులు మరియు కార్పొరేట్ డివిడెండ్లపై పన్నులు విధించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలు సామాన్యులను పీల్చి పిప్పి చేస్తున్నాయని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
70 వేల మంది పోలీసుల మోహరింపు.. పలుచోట్ల ఉద్రిక్తతలు
ర్యాలీలు హింసాత్మకంగా మారకుండా నిరోధించేందుకు ప్రభుత్వం దేశవ్యాప్తంగా దాదాపు 70,000 మంది పోలీసులను, సాయుధ వాహనాలను రంగంలోకి దించింది. పారిస్‌లోని ప్లేస్ డి లా రిపబ్లిక్ నుంచి నేషన్ వరకు భారీ మార్చ్ సాగింది. ఎక్కువ ప్రాంతాల్లో శాంతియుతంగానే నిరసనలు సాగినప్పటికీ.. లియాన్, నాంటెస్, టౌలౌస్ వంటి నగరాల్లో నిరసనకారులకు, పోలీసులకు మధ్య ఘర్షణలు తలెత్తాయి. కొన్ని ప్రాంతాలలో రాళ్ళు, టియర్ గ్యాస్ ప్రయోగాలతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రాబోయే అధ్యక్ష ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో వెల్లువెత్తుతున్న ఈ ప్రజా నిరసనలు అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రభుత్వానికి పెను సవాలుగా మారాయి.