ఓవల్ ఆఫీస్‌ను మార్చలేరు: ట్రంప్ సంచలన ఉత్తర్వులు
సూర్య ఇంటర్నేషనల్ డెస్క్, వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి అధికారిక కార్యాలయం 'ఓవల్ ఆఫీస్' , కేబినెట్ రూమ్‌లలో భవిష్యత్తులో వచ్చే అధ్యక్షులెవరూ ఎలాంటి నిర్మాణాత్మక మార్పులు చేయకుండా కట్టడి చేసే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దిన ఓవల్ ఆఫీస్ మరియు కేబినెట్ గదులను ప్రత్యేకంగా 'నేషనల్ మాన్యుమెంట్' (జాతీయ స్మారక చిహ్నం)గా గుర్తిస్తూ ఆయన ఒక అధికారిక ప్రకటనపై సంతకం చేశారు. దీని ద్వారా రాబోయే దేశాధినేతలు ఈ గదులలోని రూపురేఖలను మార్చకుండా శాశ్వత రక్షణ కల్పించవచ్చని ఆయన పేర్కొన్నారు.
గోల్డ్ టచ్ డెకార్ – ట్రంప్ మేకోవర్
రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఓవల్ ఆఫీస్‌ను తన రియల్ ఎస్టేట్ శైలికి అద్దం పట్టేలా భారీగా ఆధునీకరించారు. కార్యాలయం గోడలపై బంగారు పూతతో కూడిన ఫ్రేమ్‌లు, ప్రఖ్యాత పెయింటింగ్‌లు, సరికొత్త కర్టెన్లు మరియు ప్రత్యేక అలంకరణలతో వైట్‌హౌస్‌కు సరికొత్త రూపు తీసుకొచ్చారు. "ఓవల్ ఆఫీస్ మన దేశ ఔన్నత్యానికి, అమెరికా గొప్పదనానికి నిదర్శనం. దీనిని ఎవరూ మార్చలేరు.. కనీసం తాకలేరు" అని ఉత్తర్వులపై సంతకం చేసే సందర్భంగా ట్రంప్ వ్యాఖ్యానించారు.
చట్టపరమైన రక్షణలు, వివాదాలు
సాధారణంగా అమెరికా అధ్యక్షులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తమ అభిరుచికి తగినట్లుగా ఓవల్ ఆఫీస్ డెకార్, రగ్గులు, చిత్రపటాలను మార్చుకోవడం ఆనవాయితీగా వస్తోంది. వైట్‌హౌస్ ఇప్పటికే జాతీయ చారిత్రక మైలురాయిగా గుర్తింపు పొందినప్పటికీ, ప్రాచీన పురాతన వస్తువుల చట్టం ప్రకారం అధ్యక్షుడికి లభించే అధికారాలతో ఓవల్ ఆఫీస్, కేబినెట్ రూమ్‌లను ప్రత్యేక జాతీయ స్మారకాలుగా ట్రంప్ ప్రకటించారు. అయితే, ఒక అధ్యక్షుడు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ లేదా ప్రొక్లమేషన్‌ను తదుపరి వచ్చే అధ్యక్షుడు రద్దు చేసే అధికారం రాజ్యాంగబద్ధంగా ఉంటుందని, భవిష్యత్ పాలకులు ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.