ఒక్క అధికారిపైనే చర్యలా..? మిగతా బాధ్యుల సంగతేంటి..?
అయ్యవారిపల్లి భూ వ్యవహారంపై కొనసాగుతున్న చర్చ
రూ.4 కోట్ల భూ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని స్థానికుల డిమాండ్
2006 నుంచి 2026 వరకు జరిగిన భూ లావాదేవీలపై ఆరా తీయాలని విజ్ఞప్తి
11 మంది పేర్లపై జరిగిన పట్టా మార్పిడిపైనా విచారణ చేపట్టాలని కోరుతున్న ప్రజలు
ఉప్పునుంతల, సూర్య న్యూస్:
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం అయ్యవారిపల్లి గ్రామంలో వెలుగులోకి వచ్చిన భూ వ్యవహారం మండలవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సర్వే నంబర్ 115లోని భూమికి సంబంధించి జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమ పట్టా మార్పిడులు, రికార్డుల వ్యవహారంపై ఇప్పటికే రెవెన్యూ శాఖలో చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో అప్పటి తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవడంతో ఈ వ్యవహారంలో మరెవరెవరి పాత్ర ఉంది? విచారణ ఎంతవరకు కొనసాగుతుంది? అనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి.
ఈ వ్యవహారంలో కేవలం ఒక అధికారిపైనే చర్యలు తీసుకుని ముగిస్తారా? లేక భూ రికార్డుల మార్పిడికి సంబంధించి బాధ్యులుగా భావిస్తున్న ప్రతి ఒక్కరినీ విచారిస్తారా? అనే చర్చ సాగుతోంది. భూ లావాదేవీలకు సంబంధించిన అన్ని కోణాలను పరిశీలించి, సూత్రధారులు, పాత్రధారులను గుర్తించాలని స్థానికులు కోరుతున్నారు.
ప్రత్యేకించి భూమిపై వారసత్వ హక్కులు, సంబంధిత పత్రాల పరిశీలనతో పాటు 11 మంది పేర్లపై జరిగినట్లు చెబుతున్న పట్టా మార్పిడులపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిగినట్లు నిర్ధారణ అయితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు ఇప్పటికే స్పందించి చర్యలు చేపట్టడం నేపథ్యంలో విచారణను మధ్యలో నిలిపివేయకుండా పూర్తిస్థాయిలో కొనసాగించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
సమస్యాత్మక భూములే లక్ష్యంగా దళారీ వ్యవస్థ?
మండలంలోని పలు గ్రామాల్లో వివాదాలు, సమస్యలు ఉన్న భూములను లక్ష్యంగా చేసుకుని కొందరు మధ్యవర్తులు వ్యవహారాలు నడుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. భూ సమస్యలతో తహసీల్దార్ కార్యాలయానికి వచ్చే రైతులను కొందరు దళారులు సంప్రదించి, పనులు చేయిస్తామంటూ డబ్బులు వసూలు చేస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో సీసీఎల్ఏ (చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్) పేరును ఉపయోగించి రైతులకు నమ్మకం కలిగిస్తున్నారనే ఆరోపణలపైనా విచారణ జరపాలని స్థానికులు కోరుతున్నారు.
అధికారికంగా పరిష్కారం కావాల్సిన భూ సమస్యల విషయంలో మధ్యవర్తుల ప్రమేయం ఎంతవరకు ఉంది? డబ్బులు వసూలు చేసినట్లు వస్తున్న ఆరోపణల్లో వాస్తవమెంత? సంబంధిత అధికారులకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అనే అంశాలను అధికారులు పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
బాధిత రైతులెందరో..?
ఉప్పునుంతల మండలంలోని ఈరట్వానిపల్లి, తాడూరు, తిప్పాపూర్ తదితర గ్రామాల్లోనూ భూ సమస్యల పేరుతో కొందరు రైతులు మోసపోయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పనులు చేయిస్తామంటూ లక్షల్లో డబ్బులు తీసుకుని సమస్యలు పరిష్కరించలేదని బాధితులు వాపోతున్నట్లు సమాచారం. ఈ ఆరోపణలపై కూడా సంబంధిత శాఖ అధికారులు విచారణ చేపట్టి వాస్తవాలను వెలికితీయాలని ప్రజలు కోరుతున్నారు.
2006లో రైతు ద్యాప రాంరెడ్డి భూ క్రయవిక్రయాల నుంచి 2026 వరకు జరిగిన సంబంధిత లావాదేవీలను పరిశీలించి, రిజిస్ట్రేషన్ పత్రాలు, రెవెన్యూ రికార్డులు, పట్టా మార్పిడులు, సంబంధిత వ్యక్తుల పాత్రపై సమగ్ర విచారణ జరపాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తంగా అయ్యవారిపల్లి భూ వ్యవహారంలో తీసుకున్న చర్యలు ఎక్కడితో ఆగుతాయి? ఇతర ఆరోపణలపై కూడా విచారణ జరుగుతుందా? దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట పడుతుందా? అనే ప్రశ్నలకు జిల్లా ఉన్నతాధికారుల విచారణతోనే స్పష్టత రానుంది. బాధిత రైతులకు న్యాయం జరిగేలా పారదర్శక విచారణ చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు.