నేపాల్‌లో ఐఐటీ ఆఫ్‌షోర్ క్యాంపస్
సూర్య జాతీయ డెస్క్: నేపాల్ యువతకు ఉన్నత విద్యావకాశాలు, సాంకేతిక నైపుణ్యాలు, ఆవిష్కరణల రంగాలలో మరింత చేయూతనిచ్చే లక్ష్యంతో ఆ దేశంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆఫ్‌షోర్ క్యాంపస్‌తో పాటు స్టార్టప్ ఇంక్యుబేటర్ మరియు ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో ప్రతినిధి స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపిన అనంతరం సోమవారం నిర్వహించిన సంయుక్త ప్రకటనలో మోదీ ఈ కీలక నిర్ణయాలను వెల్లడించారు. నేపాల్ కొత్త తరం ప్రతిభ, శక్తి, ఆశయాలను సాకారం చేసుకునేందుకు భారత్ పూర్తి స్థాయిలో భాగస్వామిగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ ఏడాది ఎన్నికలలో నేపాల్ ప్రజలు బాలేంద్ర షాకు ఇచ్చిన చారిత్రక తీర్పు ఆ దేశ యువత ఆకాంక్షలకు అద్దం పడుతోందని ప్రధాని కొనియాడారు.
ఐఐటీ ఆఫ్‌షోర్ క్యాంపస్ ఏర్పాటుతో పాటు భారత్‌లోని విద్యాసంస్థలలో నేపాల్ విద్యార్థులకు స్కాలర్‌షిప్ అవకాశాలను విస్తరిస్తామని మోదీ తెలిపారు. ముఖ్యంగా న్యాయశాస్త్రం మరియు సాంకేతిక రంగాలలో నేపాల్ విద్యార్థులకు మరిన్ని స్కాలర్‌షిప్‌లు అందిస్తామని ప్రకటించారు. ఆహార శుద్ధి మరియు విలువ జోడింపు రంగాలను ప్రోత్సహించేందుకు నేపాల్‌లో అగ్రో ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధికి సహకారం అందిస్తామని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య గాఢమైన బంధుత్వం, విడదీయలేని విశ్వాసం ఆధారంగా ద్వైపాక్షిక సంబంధాలు ముందుకు సాగుతున్నాయని మోదీ పేర్కొన్నారు.
సినిమాలు, ఆధునిక సాంకేతికత, కొత్త మీడియా వేదికల ద్వారా ఇరు దేశాల యువ సృజనాత్మక నిపుణులు కలిసి పనిచేసి ఉమ్మడి వారసత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి వివరించారు. రాబోయే వేవ్స్ సదస్సులో నేపాల్ నుంచి భారీ బృందానికి భారత్ ఆతిథ్యం ఇస్తుందని ప్రకటించారు. క్రీడల రంగంలోనూ సహకారాన్ని బలోపేతం చేస్తూ, ముఖ్యంగా నేపాల్‌లో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధి మరియు ఆటగాళ్ల శిక్షణకు తోడ్పాటు అందిస్తామని మోదీ స్పష్టం చేశారు.
బాధ్యతలు స్వీకరించిన తర్వాత బాలేంద్ర షా తొలిసారిగా భారత్‌లో ద్వైపాక్షిక పర్యటన నిర్వహిస్తున్న నేపథ్యంలో విద్యా, సాంకేతిక, ఆర్థిక, క్రీడా రంగాలలో ఈ ప్రకటనలు కొత్త ఊపునిచ్చాయి. ఇరు దేశాల మధ్య సరిహద్దు అనుసంధానం, ఇంధన, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులతో పాటు యువత నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయడం ద్వారా ప్రాంతీయ సహకారం మరింత బలోపేతమవుతుందని దౌత్య వర్గాలు భావిస్తున్నాయి.