బిస్లెరీ నీరు సురక్షితమే.. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ విచారణ ఆదేశాలపై కంపెనీ కీలక స్పందన
సూర్య జాతీయ డెస్క్: ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనా నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా లేదంటూ భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ప్రముఖ వాటర్ బ్రాండ్ బిస్లెరీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ స్పందించింది. తమ ఉత్పత్తులు వినియోగానికి పూర్తిగా సురక్షితమని సంస్థ స్పష్టం చేసింది. ఈ వివాదం సుమారు 14 నెలల క్రితం అంటే 2025 సెప్టెంబర్‌లో గోవా తయారీ కేంద్రంలో ఉత్పత్తి అయిన ఒకే ఒక్క బ్యాచ్‌కు సంబంధించినదని బిస్లెరీ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. తమకు ఆహార భద్రతా నియంత్రణ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక నోటీసు అందలేదని కంపెనీ పేర్కొంది.
తాగునీటి భద్రతకు తాము అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని బిస్లెరీ తెలిపింది. పది దశల తయారీ ప్రక్రియలో భాగంగా 90కి పైగా కఠినమైన నాణ్యతా పరీక్షలు నిర్వహిస్తున్నామని, దశాబ్దాలుగా వినియోగదారుల నమ్మకాన్ని చూరగొన్న బిస్లెరీ నీరు పూర్తిగా సురక్షితమని వివరించింది. 2025 సెప్టెంబర్ 30న గోవా ప్లాంట్ నుంచి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అధికారులు ఆరు నమూనాలను సేకరించగా, ప్రాథమిక పరీక్షల్లో ఐదు నమూనాలు అన్ని ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయని కంపెనీ పేర్కొంది. అయితే ఆరో నమూనాలో నిర్ణీత పరిమితి లీటరుకు 10 మైక్రోగ్రాములు ఉండాల్సి ఉండగా, బ్రోమేట్ స్థాయి 12 మైక్రోగ్రాములుగా నమోదైందని తెలిపింది.
ప్రాథమిక పరీక్షా ఫలితాలపై 2025 నవంబర్ 22న తాము అప్పీల్ చేయడంతో ఆ నమూనాను రిఫరల్ ల్యాబొరేటరీకి పంపారని బిస్లెరీ వివరించింది. రిఫరల్ ల్యాబ్ పరీక్షల్లో బ్రోమేట్ స్థాయిలు నిర్ణీత పరిమితిలోనే ఉన్నాయని తేలినప్పటికీ, పాలీన్యూక్లియర్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్స్ ఉన్నట్లు గుర్తించారని కంపెనీ పేర్కొంది. రెండు పరీక్షల మధ్య వ్యత్యాసం రావడంతో స్పష్టత కోసం అదే నమూనాను ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ఆమోదించిన మరో స్వతంత్ర ప్రయోగశాలలో పరీక్షించామని, అక్కడ కూడా బ్రోమేట్ స్థాయిలు నిబంధనలకు లోబడే ఉన్నాయని బిస్లెరీ వెల్లడించింది. ఈ స్వతంత్ర పరీక్షా ఫలితాలను 2026 ఫిబ్రవరి 2న ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ పశ్చిమ ప్రాంతీయ కార్యాలయానికి అధికారిక లేఖ ద్వారా సమర్పించామని, ఆ తర్వాత ఎలాంటి సమాచారం రాకపోవడంతో ఆ వ్యవహారం ముగిసిపోయిందని భావించామని తెలిపింది.
అంతకుముందు ఆదివారం నాడు ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006 కింద బిస్లెరీ ఇంటర్నేషనల్‌పై ప్రాసిక్యూషన్ ప్రారంభించేందుకు అనుమతి మంజూరు చేసినట్లు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ ప్రకటించింది. ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ నమూనాలో బ్రోమేట్ పరిమితులు మించి ఉండటం, రిఫరల్ ఫుడ్ ల్యాబొరేటరీ పరీక్షల్లోనూ హానికర రసాయనాలు బయటపడటంతో ఆ నమూనాను అసురక్షితమైనదిగా నిర్ధారించి చట్టపరమైన చర్యలకు అనుమతి ఇచ్చినట్లు నియంత్రణ సంస్థ వెల్లడించింది. ఈ వ్యవహారంలో తగిన నియంత్రణ ప్రక్రియ ద్వారా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకి పూర్తి సహకారం అందిస్తామని బిస్లెరీ స్పష్టం చేసింది.