మన్ కీ బాత్ వేదికగా సర్జికల్ స్ట్రైక్స్‌ను గుర్తుచేసుకున్న ప్రధాని మోదీ
సూర్య జాతీయ డెస్క్: భారత సైన్యం 2016లో పాకిస్థాన్ భూభాగంలోని తీవ్రవాద స్థావరాలపై జరిపిన సర్జికల్ స్ట్రైక్స్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ ఆ చారిత్రాత్మక ఘట్టాన్ని గుర్తుచేసుకున్నారు. తన నెలవారీ రేడియో ప్రసంగం మన్ కీ బాత్ 138వ భాగానా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని, ఉగ్రవాద నిరోధక విధానంలో భారత్ ఒక నూతన అధ్యాయాన్ని ప్రపంచానికి చాటిచెప్పిందని వెల్లడించారు. పదేళ్ల క్రితం సెప్టెంబర్ 28, 29 తేదీల్లో భారత జవాన్లు సరిహద్దు రేఖను దాటి వెళ్లి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన తీరు ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచిందని కొనియాడారు. ఏళ్ల తరబడి ఉగ్రవాద దాడుల వల్ల భారత్ అనుభవించిన వేదనకు సర్జికల్ స్ట్రైక్ రూపంలో బలమైన, నిర్ణయాత్మకమైన సమాధానం ఇచ్చామని ప్రధాని స్పష్టం చేశారు.
గత దశాబ్ద కాలంలో ఉగ్రవాదంపై భారత వ్యూహం మరింత పదునెక్కిందని, బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ నుండి ఆపరేషన్ సింధూర్ వరకు దేశం తన స్పష్టమైన సందేశాన్ని శత్రుదేశాలకు పంపిందని ప్రధాని వ్యాఖ్యానించారు. భారత్‌పై కన్ను వేయాలని చూసే ఉగ్రవాదులకు సరిహద్దుల్లోనే తగిన రీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు. గతంలో దేశంలోని వివిధ నగరాల్లో తరచూ బాంబు పేలుళ్లు సాధారణ సంఘటనలుగా మారిన పరిస్థితులు ఉండేవని, దాడులు జరిగిన ప్రతిసారి చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వచ్చినా గత ప్రభుత్వాలు ఉపేక్షించేవారని విమర్శించారు. నేడు భారతదేశం ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని, దానికి తగ్గ ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని మోదీ పునరుద్ఘాటించారు.
ఇదే సందర్భంలో అమెరికాలో 2001 సెప్టెంబర్ 11న జరిగిన 9/11 ఉగ్ర దాడులకు 25 ఏళ్లు పూర్తయిన విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వేలాది మంది నిరపరాధులలో అమెరికన్ల తర్వాత అత్యధికంగా ప్రాణాలు కోల్పోయింది భారతీయులేనని ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో తాను ప్రధానిగా తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు న్యూయార్క్‌లోని స్మారక ప్రదేశాన్ని సందర్శించి నివాళులర్పించిన క్షణాలను గుర్తుచేసుకున్నారు. భారత్ తరఫున ఆ దాడిలో అమాయక కుటుంబాలను కోల్పోయిన బాధితులకు మరోసారి తీవ్ర సానుభూతి తెలిపారు.