అశోక్ సింఘాల్ శత జయంతి సందర్భంగా ప్రధాని మోదీ ఘన నివాళి
సూర్య జాతీయ డెస్క్: విశ్వ హిందూ పరిషత్ (VHP) మాజీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు దివంగత అశోక్ సింఘాల్ శత జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ 138వ భాగంలో మాట్లాడిన ప్రధాని, సంస్కృతి, సమాజం మరియు దేశ సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప వ్యక్తి అశోక్ సింఘాల్ అని కొనియాడారు. అయోధ్య రామజన్మభూమి ఉద్యమానికి అశోక్ సింఘాల్ అందించిన దిశానిర్దేశం, నింపిన చైతన్యమే నేడు అయోధ్యలో భవ్యమైన రామాలయ నిర్మాణానికి కారణమైందని గుర్తు చేసుకున్నారు. సమాజంలో నివసిస్తూనే ఒక సన్యాసి లాగా అత్యంత నిరాడంబర జీవితాన్ని గడిపారని ప్రశంసించారు.
రామజన్మభూమి ఉద్యమంలో అశోక్ సింఘాల్‌తో కలసి పనిచేసే భాగ్యం తనకు లభించిందని, ఆయన జీవితాన్ని అత్యంత సమీపం నుండి పరిశీలించే అవకాశం దక్కిందని ప్రధాని మోదీ గుర్తుచేసుకున్నారు. అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ వేడుకలో పాల్గొన్న సమయంలో సింఘాల్ జ్ఞాపకాలు తనకు నిరంతరం గుర్తుకొచ్చాయని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. రామాలయ ఉద్యమంతో పాటు సామాజిక వివక్ష, అసమానతలకు వ్యతిరేకంగా అశోక్ సింఘాల్ సాగించిన పోరాటం చాలామందికి తెలియదని, సమాజంలో సమానత్వం కోసం ఆయన విశేష కృషి చేశారని ప్రధాని స్పష్టం చేశారు.
అశోక్ సింఘాల్ నేపథ్యాన్ని వివరిస్తూ, ఆయన ఆగ్రాలోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించారని, ఆయన తండ్రి ఉన్నత సివిల్ సర్వెంట్ కాగా, సోదరులు కూడా ఉన్నత పదవుల్లో స్థిరపడ్డారని మోదీ తెలిపారు. సింఘాల్ స్వయంగా ఐఐటీ-బీహెచ్‌యూ (IIT-BHU) నుండి ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశారని పేర్కొన్నారు. అంతటి ఉన్నత విద్యార్హతలు, కుటుంబ ప్రాభవం ఉన్నప్పటికీ, భౌతిక సుఖాలను వదులుకుని దేశం, సంస్కృతి, సామాజిక సంక్షేమానికి తన జీవితాన్ని అంకితం చేయడమే మహోన్నతమైన వ్యక్తుల లక్షణమని ప్రధాని మోదీ కొనియాడారు.