జనాభా లెక్కల్లో 32 కోట్లకు పైగా కుటుంబాల నమోదు
మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
సూర్య జాతీయ డెస్క్: దేశవ్యాప్తంగా సాగుతున్న జనాభా లెక్కలు 2027 ప్రక్రియ మొదటి విడత ముగింపు దశకు చేరుకుందని, ఇప్పటివరకు 32 కోట్లకు పైగా కుటుంబాల వివరాలను నమోదు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. తన నెలవారీ రేడియో ప్రసంగం మన్ కీ బాత్ 138వ భాగంలో మాట్లాడిన ప్రధాని, జనాభా సేకరణ అనేది ప్రతి ఒక్కరి జాతీయ బాధ్యత అని పునరుద్ఘాటించారు. దేశ భవిష్యత్తు ప్రణాళికల రూపకల్పనకు, ఖచ్చితమైన విశ్లేషణకు జనాభా గణాంకాలు ఎంతగానో తోడ్పడతాయని తెలిపారు. మంచు కొండలు, మారుమూల ప్రాంతాలైన లడఖ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ మరియు ఉత్తరాఖండ్‌లలో కూడా ఈ ప్రక్రియ అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోందని ప్రశంసించారు.
ఉత్తరాఖండ్‌లోని చివరి గ్రామం మానాలో 83 ఏళ్ల పూర్ణిమా రావత్‌తో జనాభా గణన ప్రారంభమైన తీరును, ఉత్తరకాశీలోని బా గోరీ గ్రామానికి చెందిన హర్‌దేవ్ సింగ్ రాతోడ్ వంటి పౌరులు డిజిటల్ పద్ధతిలో తమ వివరాలను స్వయంగా నమోదు చేసుకున్న ఉదంతాలను ప్రధాని ప్రస్తావించారు. పౌరులు స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకునేందుకు వీలుగా డిజిటల్ స్వీయ నమోదు (Self-Enumeration) సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. హిందీతో పాటు 16 ప్రాంతీయ భాషల్లో ఈ సదుపాయం అందుబాటులో ఉందని, మొబైల్ ద్వారా పోర్టల్‌లోకి లాగిన్ అయి కేవలం 15 నుండి 20 నిమిషాల్లో ఎలాంటి పత్రాలు అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేకుండానే కుటుంబ వివరాలు నమోదు చేయవచ్చని వివరించారు.
డిజిటల్ స్వీయ నమోదు విధానానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని, ఇప్పటికే 2 కోట్ల 60 లక్షల మందికి పైగా పౌరులు మొబైల్ ఫోన్ ద్వారా తమ వివరాలను నమోదు చేసుకున్నారని ప్రధాని మోదీ వెల్లడించారు. ఆన్‌లైన్‌లో నమోదు పూర్తి చేసిన తర్వాత ఒక ప్రత్యేక ఐడీ వస్తుందని, అధికారులు ఇళ్లకు వచ్చినప్పుడు ఆ ఐడీని చూపిస్తే వివరాలను సరిచూసుకుంటారని చెప్పారు. ప్రజలందరూ బాధ్యతాయుతంగా ఈ ప్రక్రియలో పాల్గొని ఖచ్చితమైన వివరాలను అందించాలని, దేశ సమగ్ర స్వరూప ఆవిష్కరణలో భాగస్వాములు కావాలని ప్రధాని కోరారు.