అబూజ్‌మఢ్‌లో గిరిజన విద్యార్థులకు ఆసరాగా మారిన భట్పాల్ క్యాంపు
సూర్య జాతీయ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో ఒకప్పుడు మావోయిస్టుల ప్రాబల్యంతో అట్టుడికిన అబూజ్‌మఢ్ ప్రాంతంలో కీలక మార్పు చోటుచేసుకుంది. సుమారు పదిహేనేళ్లుగా భద్రతా బలగాల స్థావరంగా కొనసాగిన భట్పాల్ గ్రామ క్యాంపును ప్రభుత్వం ఇప్పుడు గిరిజన విద్యార్థుల వసతి గృహంగా మార్చింది. బస్తర్ డివిజన్‌లో ఇలాంటి వినూత్న ప్రయోగం జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ ఏడాది మార్చి 31 నాటికి ఛత్తీస్‌గఢ్ నక్సల్స్ రహిత రాష్ట్రంగా ప్రకటించబడిన నేపథ్యంలో, భద్రతా స్థావరాలను విద్యాలయాలుగా మారుస్తుండటం గమనార్హం.
నారాయణపూర్ కలెక్టర్ నమ్రత జైన్ ప్రత్యేక చొరవతో ఈ ప్రాంగణాన్ని గిరిజన విద్యార్థుల వసతి గృహంగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఈ క్యాంపులో షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) విద్యార్థుల కోసం రెండు వేర్వేరు హాస్టళ్లు విజయవంతంగా నడుస్తున్నాయి. ఆరు నుంచి పదవ తరగతి చదివే విద్యార్థుల కోసం వంద మంది సామర్థ్యంతో ప్రీ-మెట్రిక్ ఎస్టీ బాయ్స్ హాస్టల్ ఉండగా, పన్నెండవ తరగతి వరకు చదివే విద్యార్థుల కోసం పోస్ట్-మెట్రిక్ హాస్టల్ అందుబాటులోకి తెచ్చారు. మారుమూల గ్రామాల నుంచి వచ్చి చదువుకోవడానికి దూర ప్రాంతాల ఇబ్బందులను ఎదుర్కొంటున్న విద్యార్థులకు ఈ హాస్టల్ ఎంతగానో ఉపకరిస్తోంది.
పాఠశాలకు కేవలం యాభై మీటర్ల దూరంలోనే ఈ వసతి గృహం ఉండటం వల్ల విద్యార్థులకు ప్రయాణ భారం తప్పుతుంది. బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాల క్యాంపులు రానున్న రోజుల్లో పాఠశాలలు, ఆసుపత్రులు మరియు ప్రజా సంక్షేమ కేంద్రాలుగా మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. భద్రతా సమస్యలు తొలగిపోయిన ప్రాంతాలలో విద్య, వైద్యం మరియు మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ఈ పరిణామం స్పష్టం చేస్తోంది.