నేడు స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ భారత పర్యటన
సూర్య జాతీయ డెస్క్: స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గై పార్మెలిన్ మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం నేడు భారతదేశానికి చేరుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఉన్నత స్థాయి అధికారుల బృందం, ప్రముఖ వ్యాపారవేత్తలతో కలిసి భారత గడ్డపై అడుగుపెడుతున్నారు. గై పార్మెలిన్ భారత పర్యటనకు రావడం ఇది మొదటి అధికారిక స్టేట్ విజిట్ కావడంతో పాటు ఈ ఏడాదిలో ఆయన దేశానికి రావడం ఇది రెండోసారి కావడం విశేషం. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను సరికొత్త శిఖరాలకు చేర్చడంతో పాటు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఎఫ్‌టా) ఒప్పందాల పురోగతిని మరింత వేగవంతం చేసేందుకు దోహదపడనుంది.
భారత్ చేరుకోనున్న స్విస్ అధ్యక్షుడితో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తొలుత భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో గై పార్మెలిన్ ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఈ చర్చల్లో వాణిజ్యం, పెట్టుబడులు, సైన్స్ అండ్ టెక్నాలజీ, పరిశోధన మరియు ఆవిష్కరణలు, ఉభయ దేశాల పౌరుల రాకపోకలు వంటి రంగాల్లో పరస్పర సహకారంపై కీలక సమీక్ష నిర్వహించనున్నారు. అలాగే భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా ఆయన ప్రత్యేకంగా సమావేశం కానుండగా, రాష్ట్రపతి భవన్‌లో స్విస్ అధ్యక్షుడి గౌరవార్థం అధికారిక విందు కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.
తన పర్యటనలో భాగంగా అక్టోబర్ 7వ తేదీన న్యూఢిల్లీలో జరగనున్న రెండో భారత్-ఎఫ్‌టా ప్రాస్పెరిటీ సమ్మిట్‌లో గై పార్మెలిన్ ముఖ్య ప్రసంగం చేయనున్నారు. స్విట్జర్లాండ్, ఐస్‌లాండ్, నార్వే, లీచ్టెన్‌స్టెయిన్ దేశాలతో కూడిన ఎఫ్‌టా కూటమితో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సదస్సు వాణిజ్య రంగానికి ఎంతో కీలకం కానుంది. భారత్‌తో భారీ వాణిజ్య, పెట్టుబడి భాగస్వామ్యం కలిగిన స్విట్జర్లాండ్ దేశాధినేత రాకతో రాబోయే రోజుల్లో భారత ఆర్థిక రంగానికి భారీ ఎత్తున పెట్టుబడులు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.