డబ్బు కోసం ఆరాటం.. రెండు నిండు ప్రాణాలు బలి !
మంచిర్యాల ‘ప్రతిభ’ ఆసుపత్రిలో దారుణం - వైద్యుల నిర్లక్ష్యంపై విమర్శల వెల్లువ
• ప్రసవ వేదనలోనూ.. డబ్బుల కోసం నిరీక్షణ!
• కాలయాపనకు తల్లీబిడ్డల బలి?
• ప్రాణాలకంటే పైసే ముఖ్యమంటూ.. చికిత్సలో జాప్యం..
• వ్యాపార కోణంలో ప్రైవేటు ఆసుపత్రి వైద్యం.. విగత జీవులుగా మారుతున్న అమాయకులు
• ప్రాణాలు కాపాడే దేవాలయంలో మృత్యువాత?
• తల్లి, బిడ్డలను పొట్టనబెట్టుకున్న మనీ మత్తు..
డబ్బే పరమావధిగా భావించే కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల తీరుకు నిండు ప్రాణాలు బలవుతున్నాయి. వైద్యం చేయాల్సిన చేతులు డబ్బు కోసం ఆరాటపడితే ఎలా ఉంటుందో మంచిర్యాలలో జరిగిన ఈ ఘటనే ప్రత్యక్ష సాక్ష్యం. నార్మల్ డెలివరీ పేరుతో 12 గంటల పాటు కాలయాపన చేసి, చివరకు తల్లీబిడ్డ ఇద్దరి ఉసురు తీసిన ఘటన జిల్లాను కుదిపేసింది.
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :
పండంటి బిడ్డను కనాలని ఆశించిన ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ప్రసవం కోసం ఆసుపత్రిలో చేరిన నిండు గర్భిణీ, ఆమె కడుపులోని శిశువు మృత్యువాత పడ్డారు. వైద్యం అందించడంలో జరిగిన జాప్యమే తమ కుటుంబంలో తీరని విషాదానికి కారణమైందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో ఉన్న ప్రతిభ ప్రైవేటు ఆసుపత్రిలో చోటుచేసుకుంది.
• మధ్యాహ్నం డబ్బులు.. అర్ధరాత్రి వరకు జాప్యం
బాధిత కుటుంబం ఎలాగోలా సర్దుబాటు చేసి మధ్యాహ్నం 3 గంటలకు డబ్బు చెల్లించింది. అయినా వైద్యుల తీరులో మార్పు రాలేదు. నార్మల్ డెలివరీ అవుతుందంటూ సాయంత్రం నుండి రాత్రి 10 గంటల వరకు కాలయాపన చేశారు. ఈలోపు గర్భంలోని శిశువు తీవ్ర ఇబ్బందికి గురై ప్రాణాలు కోల్పోయింది.
• శిశువు మృతి.. ఆపై మరో ఆసుపత్రికి తరలింపు
గర్భంలోని శిశువు మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే తేరుకున్న ఆసుపత్రి సిబ్బంది, తమ నిర్లక్ష్యం బయటపడుతుందనే భయంతో రుచితను ఒక ప్రైవేటు అంబులెన్స్ లో మరో ఆసుపత్రికి తరలించారు. కానీ, అక్కడ వైద్యులు పరీక్షించి చూసేసరికి రుచిత అప్పటికే గంటన్నర క్రితమే మృతి చెందినట్లు నిర్ధారించడం కలకలం రేపింది.
• ఆసుపత్రి ఎదుట మృతదేహంతో ధర్నా
తమకు జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కుటుంబ సభ్యులు, బంధువులు సోమవారం ఉదయం ప్రతిభ ఆసుపత్రి ఎదుట మృతదేహంతో బైఠాయించారు. తల్లీబిడ్డల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
• బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
వైద్యుల నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఘటనకు సంబంధించి వైద్యపరమైన నివేదికలు, పోస్టుమార్టం వివరాల ఆధారంగా వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది. ఆరోపణలపై ఆసుపత్రి యాజమాన్యం వివరణ తెలియాల్సి ఉంది.