ఉత్తర కొరియాతో చర్చలు పునరుద్ధరించాలి
సూర్య అంతర్జాతీయ డెస్క్: కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపనకు ముందడుగు వేయాలని దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ జే మ్యుంగ్ ఉత్తర కొరియాను కోరారు. సాయుధ దినోత్సవం సందర్భంగా అక్టోబర్ 1న నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, రెండు దేశాల మధ్య పరస్పర విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మరియు సైనిక ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి చర్చల మార్గమే శరణ్యమని స్పష్టం చేశారు. ఇటీవల డిమిలిటరైజ్డ్ జోన్ (డీఎంఈ) ప్రాంతంలో జరిగిన ల్యాండ్‌మైన్ పేలుడు ఘటనలో దక్షిణ కొరియా సైనికులు గాయపడటంతో పాటు, ఇది ఆర్మిస్టిస్ ఒప్పంద ఉల్లంఘన కిందకు వస్తుందని ఐక్యరాజ్యసమితి కమాండ్ వెల్లడించిన తరుణంలో అధ్యక్షుడు లీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మరోవైపు, దేశ రక్షణ రంగాన్ని మరింత పటిష్టం చేసేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని లీ స్పష్టం చేశారు. భవిష్యత్ యుద్ధ వ్యూహాలకు అనుగుణంగా ఆర్మీని ఆధునీకరిస్తామని, ఇందులో భాగంగా 2030 నాటికి అణు శక్తితో నడిచే జలాంతర్గాములను (న్యూక్లియర్-పవర్డ్ సబ్ మెరైన్స్) నిర్మించనున్నట్లు ఆయన ప్రకటించారు. అలాగే కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత కమాండ్-అండ్-కంట్రోల్ సిస్టమ్స్, హై-ఎనర్జీ లేజర్ ఇంటర్‌సెప్టర్లతో కూడిన అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. అమెరికా నుంచి యుద్ధకాల ఆపరేషనల్ కంట్రోల్ (OPCON) అధికారాలను పూర్తిగా చేజిక్కించుకోవడం ద్వారా స్వయంసమృద్ధమైన జాతీయ రక్షణ రంగాన్ని ఏర్పాటు చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అధ్యక్షుడు లీ పునరుద్ఘాటించారు.