హిమాలయాల్లో మరో ఆరు శిఖరాలకు అంతర్జాతీయ గుర్తింపు కోరుతూ నేపాల్ ప్రతిపాదన
సూర్య అంతర్జాతీయ డెస్క్: ప్రపంచ పర్వతారోహణ చరిత్రలో అత్యంత ప్రాధాన్యత సంతరించుకునే చారిత్రాత్మక పరిణామానికి నేపాల్ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ప్రపంచంలో 8,000 మీటర్లకు పైగా ఎత్తు ఉన్న ఎనిమిది అత్యున్నత శిఖరాలకు నిలయంగా ఉన్న నేపాల్, తాజాగా మరో ఆరు శిఖరాలను కూడా అదే జాబితాలో చేర్చాలని అధికారికంగా కోరుతోంది. రాజధాని కాఠ్‌మాండ్ వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ క్లైంబింగ్ అండ్ మౌంటెనీరింగ్ ఫెడరేషన్ (యూఐఏఏ) జనరల్ అసెంబ్లీలో నేపాల్ ఈ ప్రతిపాదనను అధికారికంగా ప్రవేశపెట్టింది. ఈ ప్రతిపాదనకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తే ప్రపంచ పర్యాటక మరియు పర్వతారోహణ రంగంలో నేపాల్ స్థానం మరింత పదిలం కానుంది.
నేపాల్ మౌంటెనీరింగ్ అసోసియేషన్ (ఎన్‌ఎంఏ) ఆధ్వర్యంలో ఏర్పాటైన ప్రత్యేక నిపుణుల అధ్యయన బృందం ఈ ఆరు పర్వత శిఖరాలకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలను సేకరించింది. ఈ శిఖరాలకు వేర్వేరు భౌగోళిక గుర్తింపు, ప్రత్యేక శిఖరాలు మరియు విభిన్న పర్వతారోహణ మార్గాలు ఉన్నట్లు జిఐఎస్ (GIS) ఆధారిత కొలతల ద్వారా నిర్ధారించారు. ప్రసిద్ధ లోట్సే మరియు కాంచనగంగా పర్వత శ్రేణులలో విస్తరించి ఉన్న ఈ శిఖరాల ఎత్తు 8,000 మీటర్లకు పైగా ఉన్నట్లు స్పష్టమైంది.
ప్రస్తుతం ప్రతిపాదించిన జాబితాలో యాలుంగ్ కాంగ్ (8,505 మీ.), కాంచనగంగా సౌత్ (8,476 మీ.), కాంచనగంగా సెంట్రల్ (8,473 మీ.), లోట్సే మిడిల్ (8,410 మీ.), లోట్సే షార్ (8,400 మీ.) మరియు యాలుంగ్ కాంగ్ వెస్ట్ (8,077 మీ.) శిఖరాలు ఉన్నాయి. ఈ ఆరు శిఖరాలకు కూడా అంతర్జాతీయ సంస్థల నుండి అధికారిక హోదా దక్కితే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది వేల మీటర్ల పర్వతాల సంఖ్య 14 నుండి ఏకంగా 20కి చేరుకుంటుంది. అప్పుడు ఒక్క నేపాల్ దేశంలోనే ఏకంగా 14 అత్యున్నత శిఖరాలు ఉన్నట్లవుతుందని, ఇది దేశ పర్వత ఆర్థిక వ్యవస్థకు, సాహస పర్యాటక రంగానికి మహర్దశ తెస్తుందని నేపాల్ సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి ఖడ్గరాజ్ పౌడెల్ ఆశాభావం వ్యక్తం చేశారు.