BREAKING
ఆధ్యాత్మిక వైభవానికి సాక్ష్యం.. ఈ చారిత్రక ఆలయం యాపిల్ సంస్థకు భారీ షాక్.. ట్రంప్-జిన్‌పింగ్ భేటీలో కీలక ఒప్పందం.. అమెరికా బొగ్గు కొనుగోళ్లకు చైనా హామీ, కొనసాగుతున్న సుంకాల చర్చలు ఆసియా క్రీడలు 2026 డే 8 షెడ్యూల్.. రేపు బరిలోకి దిగనున్న భారత అథ్లెట్లు, పతక పోరు వివరాలు ఆమె క‌విత్వం ఆత్మ విశ్వాసానికి ప్ర‌తీక‌.. 4(A) నేవల్ మెడికల్ యూనిట్ NCC వార్షిక తనిఖీ – ‘శిక్షణ’ బహుళ ప్రయోజన శిక్షణా మందిరం ప్రారంభం వాహనాల అతివేగానికి కళ్లెం...? శిథిలావస్థలో మద్ది బ్రిడ్జి..! భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో మహా దారుణం..! అవంతిలో ఘనంగా ప్రపంచ ఫార్మాసిస్ట్ దినోత్సవ వేడుకలు ఒరాకిల్ టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ.8,200 కోట్ల విలువైన స్టాక్ ఆప్షన్లు.. షేర్ల పతనంతో చిక్కుల్లో పడ్డ నాయకత్వం ఖైరతాబాద్‌ ఉపఎన్నికపై బీజేపీ కసరత్తు ముమ్మరం ఇతర రాష్ట్రాల ఆజ్ఞలను పాటిస్తున్నారు విద్యుత్ రంగాన్ని రేవంత్ ప్రభుత్వం నాశనం చేసింది వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి రేవంత్ డైవర్షన్ డ్రామాలు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉభయ గోదావరి జిల్లాల్లో సంచారి సినిమా విడుదల హక్కులను దక్కించుకున్న గాయత్రి ఫిలిమ్స్ మాదాపూర్‌, గచ్చిబౌలిలో 11 హోటళ్ల లైసెన్సులు రద్దు

ఆధ్యాత్మిక వైభవానికి సాక్ష్యం.. ఈ చారిత్రక ఆలయం

Select Suryaa Now
ఆధ్యాత్మిక వైభవానికి సాక్ష్యం.. ఈ చారిత్రక ఆలయం

ఉదయించే సూర్యుడు చీకట్లను తొలగించి ప్రపంచానికి వెలుగునిచ్చినట్లే.. సూర్యభగవానుడి అనుగ్రహం..తమకు ఆరోగ్యం, ఆయుష్షు, శక్తి ప్రసాదిస్తుందని భక్తులు భావిస్తారు. ప్రత్యక్ష దైవంగా కొలిచే సూర్యనారాయణ స్వామి స్వయంభూగా కొలువైన అరసవల్లి క్షేత్రం భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా..ఉత్తరాంధ్ర ఆధ్యాత్మిక వైభవానికి సాక్ష్యంగా నిలుస్తోంది. శ్రీకాకుళం సమీపంలోని ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం, ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని కోరుకుంటూ భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకే అపూర్వ దృశ్యం

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి ఉన్న ప్రత్యేకతల్లో సూర్యకిరణాల ప్రసరణ అత్యంత విశిష్టమైనది. ఆలయ నిర్మాణం, దిశలు, గర్భగుడి నిర్మాణ తీరు ఖగోళ శాస్త్ర పరిజ్ఞానాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయని భక్తులు విశ్వసిస్తారు.

ప్రతి ఏడాది మార్చి 9 నుంచి 11 వరకు, అక్టోబర్ 1 నుంచి 3 వరకు ఉదయించే సూర్యుడి తొలి కిరణాలు ఆలయంలోకి ప్రవేశించి మూలవిరాట్‌ పాదాలను తాకే అద్భుత దృశ్యం కనిపిస్తుంది. ఆలయ ప్రధాన ద్వారం నుంచి లోపలికి ప్రవేశించే సూర్యకిరణాలు ధ్వజస్తంభాన్ని దాటి గర్భాలయంలోని స్వామివారి పాదపద్మాలను తాకుతాయి.

ఏడు గుర్రాలు లాగే రథంపై పద్మాసనంలో దర్శనమిచ్చే సూర్యనారాయణ స్వామివారి పాదాలపై సూర్యకిరణాలు పడే ఈ అపూర్వ దృశ్యాన్ని చూసేందుకు ఆ సమయంలో పెద్ద సంఖ్యలో భక్తులు అరసవల్లికి చేరుకుంటారు.

రథసప్తమికి అరసవల్లిలో భక్తజనం

అరసవల్లి క్షేత్రంలో నిర్వహించే ఉత్సవాల్లో రథసప్తమికి ప్రత్యేక స్థానం ఉంది. సూర్యభగవానుడి జన్మదినంగా భావించే ఈ పర్వదినం సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి దర్శనం కోసం బారులు తీరుతారు.

రథసప్తమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అలంకరణలు, విశేష అర్చనలు, అభిషేకాలు నిర్వహిస్తారు. ముఖ్యంగా క్షీరాభిషేకం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుగుతుంది. ఈ పర్వదినాన స్వామివారిని దర్శించుకుంటే పాపాలు తొలగి, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు లభిస్తాయని భక్తుల విశ్వాసం.

చరిత్రలోనూ ప్రత్యేక స్థానం

అరసవల్లి ఆలయానికి శతాబ్దాల చరిత్ర ఉందని క్షేత్ర చరిత్ర చెబుతోంది. తూర్పు గంగ వంశానికి చెందిన రాజు దేవేంద్ర వర్మ ఏడో శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి.

అరసవల్లి క్షేత్ర పురాణానికి సంబంధించిన కథనాలు కూడా ఎంతో విశిష్టంగా ఉన్నాయి. పద్మపురాణం ప్రకారం.. దేవేంద్రుడు తన వజ్రాయుధంతో ఇక్కడి పవిత్ర జలాశయాన్ని తవ్వాడని, అనంతరం కశ్యప మహర్షి సూర్యభగవానుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని స్థలపురాణం చెబుతోంది. ఈ కారణంగానే ఆలయ పరిసరాల్లోని సూర్య పుష్కరిణికి కూడా ప్రత్యేక ఆధ్యాత్మిక ప్రాధాన్యం ఏర్పడింది.

సూర్యభగవానుడితో పాటు దేవతామూర్తులు

అరసవల్లి ఆలయంలోని మూలవిరాట్‌ సూర్యభగవానుడు ఏడు గుర్రాల రథంపై పద్మాసనంలో దర్శనమిస్తారు. స్వామివారితో పాటు ఉష, పద్మిని, ఛాయా దేవతలు కూడా కొలువై ఉండటం ఈ ఆలయానికి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.

సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా ఆరాధించే భక్తులు ఇక్కడ సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయం, ప్రత్యేక అర్చనలు నిర్వహిస్తారు. ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవుడిగా సూర్యనారాయణ స్వామిని కొలుస్తూ అనేక ప్రాంతాల నుంచి భక్తులు అరసవల్లికి వస్తుంటారు.

భక్తుల కోసం ప్రత్యేక దర్శన ఏర్పాట్లు

అరసవల్లి ఆలయంలో సాధారణంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తులకు దర్శన సౌకర్యం ఉంటుంది. ఆదివారాలు, ముఖ్యమైన పర్వదినాల్లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఉదయం 5.30 గంటల నుంచే ఆలయాన్ని తెరుస్తారు.

పండుగలు, ప్రత్యేక ఉత్సవాల సమయంలో ఆలయ అధికారులు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. క్యూలైన్లు, తాగునీరు, పారిశుద్ధ్యం, భద్రత తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తారు.

శ్రీకాకుళం నుంచి సులభంగా చేరుకునే అవకాశం

అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం శ్రీకాకుళం పట్టణానికి సమీపంలోనే ఉంది. శ్రీకాకుళం నుంచి ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. శ్రీకాకుళం రోడ్‌ (ఆమదాలవలస) రైల్వే స్టేషన్‌ ఆలయానికి సుమారు 13 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుంచి బస్సులు, ఆటోలు, ఇతర రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సమీప విమానాశ్రయం ద్వారా కూడా ప్రయాణించి రోడ్డు మార్గంలో అరసవల్లికి చేరుకోవచ్చు.

ఆధ్యాత్మికత.. ఆరోగ్యం.. ఖగోళ విజ్ఞానం కలగలిసిన క్షేత్రం

సూర్య నమస్కారాలు, ఆదిత్య హృదయ పారాయణాలు, భక్తుల ఆధ్యాత్మిక సందడితో అరసవల్లి క్షేత్రం ఎప్పుడూ ప్రత్యేక వాతావరణాన్ని సంతరించుకుంటుంది. శతాబ్దాల చరిత్ర, విశిష్టమైన ఆలయ నిర్మాణం, సూర్యకిరణాలు స్వామివారి పాదాలను తాకే అపూర్వ దృశ్యం, వైభవమైన రథసప్తమి వేడుకలు.. ఇవన్నీ అరసవల్లిని ప్రత్యేక పుణ్యక్షేత్రంగా నిలబెట్టాయి.

భక్తి, చరిత్ర, ఖగోళ అద్భుతం, ప్రకృతి సౌందర్యం కలిసిన అరసవల్లి క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు కోరుకుంటారు.

దొండపర్తి రమేష్, బ్యూరో ఇంచార్జి, సూర్య, శ్రీకాకుళం.