ఎనిమిది అడుగుల కాలభైరవుడు.. ఎడ్లబండి ఆగిపోయిన చోటే వెలసిన రామారెడ్డి స్వయంభూ క్షేత్ర విశేషాలు
సూర్య తెలంగాణ డెస్క్: పరమ శివుని అత్యంత భీకరమైన, శక్తిమంతమైన, రౌద్ర రూపమే కాలభైరవ స్వరూపం. కాలానికి, మృత్యువుకు అధిపతిగా, విశ్వ రక్షణ మరియు ఆలయాల రక్షణ బాధ్యత వహించే దైవంగా కాలభైరవుడిని భక్తులు కొలుస్తారు. "నేను" అనే అహంకారమే మనిషి పతనానికి కారణం అని ఆధ్యాత్మిక తత్వం చెబుతుంది. పురాణ కథనం ప్రకారం, బ్రహ్మదేవునిలో ఏర్పడిన అహంకారాన్ని అణచివేసిన శివుని ఉగ్ర స్వరూపమే కాలభైరవుడు. "నాకంటే గొప్పవాడు లేడు" అనే అహంకారం ఎవరిలోనూ ఉండకూడదు అనే గొప్ప సందేశాన్ని ఈ రూపం అందిస్తుంది. హిందూ సంప్రదాయంలో ఆలయాలను, దిక్కులను రక్షించే క్షేత్రపాలకుడిగా భావించే ఈ స్వామికి దేశవ్యాప్తంగా అనేక ప్రాచీన ఆలయాలున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని కామారెడ్డి సమీపంలో వెలసిన ప్రసిద్ధ రామారెడ్డి కాలభైరవ క్షేత్ర విశేషాలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి.
తెలంగాణలోని కామారెడ్డి పట్టణానికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో వెలసిన ఈ ప్రాచీన కాలభైరవ క్షేత్రం ఎంతో విశిష్టమైనది. ఈ క్షేత్రంలో కాలభైరవుడు స్వయంభువుగా వెలసినట్లు ఆలయ స్థల పురాణం చెబుతోంది. సుమారు 16వ శతాబ్దంలో కాశీ నుంచి కాలభైరవ స్వామివారి విగ్రహాన్ని ఎడ్లబండిపై తీసుకువస్తుండగా, ఈ ప్రాంతానికి చేరుకునే సమయానికి రాత్రి కావడంతో భక్తులు అక్కడే విశ్రాంతి తీసుకున్నారు. హఠాత్తుగా అర్ధరాత్రి సమయంలో భారీ శబ్దం రావడంతో ఎడ్లబండి విరిగిపోయి, స్వామివారి విగ్రహం అక్కడే నిటారుగా నిలిచిపోయిందని చెబుతారు. ఈ సంఘటనను స్వామి వారి సంకల్పంగా భావించిన భక్తులు, సరిగ్గా ఎడ్లబండి ఆగిపోయిన ఆ ప్రదేశంలోనే ఆలయాన్ని నిర్మించారని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది.
ఈ ఆలయ గర్భాలయంలో శునకాన్ని వాహనంగా చేసుకున్న సుమారు ఎనిమిది అడుగుల ఎత్తైన దిగంబర కాలభైరవ స్వామి వారి మూలవిరాట్టు భక్తులకు కనులవిందుగా దర్శనమిస్తుంది. దాదాపు రెండు వేల సంవత్సరాల క్రితం నాటి చరిత్ర కలిగిన ఈ గుడిలోని విగ్రహం సా.శ.13వ శతాబ్ద కాలం నాటిదని చరిత్రకారుల అభిప్రాయం. ఈ గ్రామంలో అష్టభైరవులు వెలసినట్లు స్థానికులు నమ్ముతారు. పూర్వం ఈ ప్రాంతంలో కరువు వచ్చినపుడు కాలభైరవుని విగ్రహానికి పేడ పూసేవారనీ, ఆ తర్వాత ఆ పేడను తొలగించుకోవడం కోసం వర్షాలు బాగా కురిసేవనీ ఇక్కడి ప్రజల ప్రగాఢ విశ్వాసం. 1974లో దేవాదాయ శాఖ ఈ గుడిని తమ అధీనంలోకి తీసుకుని, దాతల సహకారంతో 2001లో నూతన దేవాలయాన్ని నిర్మించి రేకుల షెడ్డులో ఉన్న స్వామి విగ్రహాన్ని గర్భాలయంలోకి మార్చారు. అంతేకాకుండా ఆలయ ప్రాంగణంలో ఇటీవల శనీశ్వర స్వామి వారి ఆలయాన్ని కూడా నిర్మించారు.
ఈ క్షేత్రంలో కార్తిక మాసంలో కాలభైరవ స్వామి వారి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. అలాగే మార్గశిర శుద్ధ అష్టమి రోజు కాలభైరవ స్వామి జయంతి సందర్భంగా ప్రత్యేక పూజోత్సవాలు కన్నులపండువగా జరుగుతాయి. అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ దివ్య క్షేత్రాన్ని దర్శించి, కాలభైరవ స్వామివారి ఆశీస్సులు పొందితే సత్వర ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల నమ్మకం. కాలాన్ని నియంత్రించే ఆ భైరవుని కృప ఉంటే సమస్త భయాలు తొలగి ధైర్యం కలుగుతుందని భక్తులు భావిస్తారు. ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లే ఈ రామారెడ్డి కాలభైరవ క్షేత్రాన్ని దర్శించి తరిద్దాం. ఓం కాలభైరవాయ నమః!